Telangana High Court : తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం.. వాదనలు వినిపిస్తుండగా లాయర్‌కు గుండెపోటు, మృతి
Telangana High Court : హార్ట్ ఎటాక్.. ఎవ్వరికి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ఏ వయస్సు వారైనా గుండెపోటుకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం జరిగింది. వాదనలు వినిపిస్తుండగా.. లాయర్‌కు గుండెపోటు వచ్చి మృతిచెందారు.

తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం జరిగింది. కోర్టు హాలులో లాయర్ కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై తోటి న్యాయవాదులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ లాయర్ వేణుగోపాల రావు.. 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కూప్పకూలారు.
విచారణ నిలిపివేత..
దీన్ని గమనించిన తోటి లాయర్లు వెంటనే అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వేణుగోపాల రావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. వేణుగోపాల రావు మృతికి సంతాప సూచకంగా.. 21వ కోర్టు హాలులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా హాళ్లలోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.
గుండెపోటు ఎందుకొస్తుంది..
కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు ధమనుల గోడలపై పేరుకుపోయి ఫలకాలుగా ఏర్పడతాయి. ఈ ఫలకాలు ధమనులను కుంచించుకుపోయేలా చేస్తాయి. దీని వలన గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఒక ఫలకం పగిలిపోయినప్పుడు, రక్తం గడ్డకట్టి ధమనిని పూర్తిగా మూసివేస్తుంది. దీని వలన గుండెపోటు వస్తుంది. అధిక రక్తపోటు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది గుండె కండరాలను బలహీనపరుస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
శారీరక శ్రమ లేకపోతే..
రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనులలో ఫలకాలు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం ధమనులను దెబ్బతీస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన ఒత్తిడి గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది.
లక్షణాలు ఇవీ..
కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, ఎడమ చేయి, మెడ, దవడ లేదా వెనుక భాగంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం లేదా వాంతులు, తల తిరగడం లేదా మూర్ఛపోవడం వంటివి గుండెపోటు లక్షణాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.