రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రస్తుతం ఏం జరుగుతోంది.. ఎంపిక విధానం ఎలా ఉండబోతోంది?-latest update regarding telangana rajiv yuva vikasam scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రస్తుతం ఏం జరుగుతోంది.. ఎంపిక విధానం ఎలా ఉండబోతోంది?

రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రస్తుతం ఏం జరుగుతోంది.. ఎంపిక విధానం ఎలా ఉండబోతోంది?

రాజీవ్‌ యువ వికాసం పథకం గ్రౌండింగ్ కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఉన్న నోడల్ అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. పారదర్శకంగా యూనిట్లను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇలా ఉంది.

క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన (unsplash)

రాజీవ్‌ యువ వికాసం పథకం కోసం.. దరఖాస్తుదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్‌ మైనార్టీలు దాదాపు 13.45 లక్షల మంది ఆన్‌లైన్‌ ద్వారా పథకానికి దరఖాస్తు చేశారు. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో బీసీలవే ఎక్కువ ఉన్నాయి. వచ్చిన దరఖాస్తులను ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా విభజించారు.

దరఖాస్తుల పరిశీలన..

క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ అధికారులు దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ల లక్ష్యాల మేరకు.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. యూనిట్ల మంజూరు కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు.. మండల కమిటీలు, జిల్లా కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి.

ఎంపిక ప్రక్రియ ఇలా..

క్షేత్రస్థాయిలో పరిశీలించిన దరఖాస్తులను.. మండల స్థాయి స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుంది. ఇక్కడ లబ్ధిదారులను ఖరారు చేసి.. జిల్లా కమిటీలకి నివేదిక సమర్పిస్తారు. అక్కడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతో జూన్‌ 2న రాయితీ రుణాలను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ మంజూరు చేస్తారు. మండల కమిటీలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.

వీరు సభ్యులు..

మండల ప్రత్యేకాధికారి, బ్యాంకు మేనేజర్లు, కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జిల్లా కమిటీలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా, డీఆర్డీఏ కన్వీనర్, ఆయా శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, నిర్దేశిత గడువులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని నోడల్‌ అధికారులు చెబుతున్నారు.

పాతవి రాలేదు.. కొత్తగా ఛాన్స్ లేదు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితబంధు పథకం మినహా.. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సంబంధించి రాయితీ రుణాలు కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. రుణాలు మంజూరైనా.. ఆర్థిక శాఖలో బ్రేక్ పడటంతో.. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఆర్థికశాఖలో పెండింగ్‌ ఉన్న లబ్ధిదారులకు రాజీవ్‌ యువ వికాసం పథకంలోనూ దరఖాస్తు చేసుకునేందుకు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

కరువైన స్పష్టత..

అటు పాత రుణాలు రాక.. ఇటు రాజీవ్‌ యువ వికాసం రాయితీ రుణాలు అందక.. లబ్ధిదారులు నష్టపోతున్నారు. అయితే.. ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న పాత రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఎప్పటిలోగా వాటిని మంజూరు చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో.. వాటికోసం దరఖాస్తు చేసుకున్నవారు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనం