Hyderabad RRR : హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పుణ్యం.. ఈ 4 జిల్లాల్లో భూములు బంగారం!-land prices in 4 districts have increased due to the hyderabad regional ring road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rrr : హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పుణ్యం.. ఈ 4 జిల్లాల్లో భూములు బంగారం!

Hyderabad RRR : హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పుణ్యం.. ఈ 4 జిల్లాల్లో భూములు బంగారం!

Basani Shiva Kumar HT Telugu
Jan 02, 2025 04:02 PM IST

Hyderabad RRR : దేశంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కత్తా వంటి నగరాల సరసన భాగ్యనగరం నిలుస్తోంది. తాజాగా.. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ అభివృద్ధి వేరే లెవల్‌కు వెళ్తోందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నగరం చుట్టుపక్కల 4 జిల్లాల్లో అభివృద్ధి వేగంగా జరగనుంది.

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు

దేశానికి స్వాతంత్ర్యం రాకముందే హైదరాబాద్ సంస్థానం చాలా రిచ్. స్వాతంత్ర్యం వచ్చాక.. భాగ్యనగరంలో వేలాది ఎకరాల ప్రభుత్వ ఆస్తులు ఉండేవి. అప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా కట్టడాలు, నిర్మాణాలు హైదరాబాద్‌లో వెలిశాయి. ఆ తర్వాత కాలక్రమేనా పరిశ్రమల అభివృద్ధి, ఫార్మా రంగం అభివృద్ధి హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. సైబర్ టవర్స్ నిర్మాణం, ఐటీ ఎగుమతులు హైదరాబాద్ అభివృద్ధి బంగారు బాటలు వేశాయి.

yearly horoscope entry point

శివార్లలో అభివృద్ధి..

ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాయి. తద్వారా నగర అభివృద్ధితో పాటు.. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో.. నగర రూపురేఖలు మారిపోయాయి. గతంలో ఉన్న నగరం కంటే.. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అభివృద్ధి చెందింది.

సొంతంగా అభివృద్ధి..

తాజాగా.. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేని విధంగా తయారైంది. ముఖ్యంగా రియల్ రంగంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌ భూములకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాల వారు కూడా హైదరాబాద్ పరిసరాల్లో భూములు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణమయ్యే 4 నాలుగు జిల్లాల్లో భూములు కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు.

4 జిల్లాల్లో..

రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా దీన్ని నిర్మించనున్నారు. ప్రధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు తోపాటు.. జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 ఇంటర్‌ఛేంజ్‌లతో పాటు టోల్‌ప్లాజాలు, రెస్ట్‌రూంలు, సర్వీసు రోడ్లు, బస్‌బేలు, ట్రక్‌ బేలు నిర్మించనున్నారు. ప్రస్తుతం నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నా.. భవిష్యత్తులో ఆరు, ఎనిమిది వరుసలుగా పెంచుకునే అవకాశం ఉంది.

బంగారంతో పోటీ..

దీంతో ఇప్పుడైతే.. ఈ 4 జిల్లాల పరిధిలో భూముల ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. ఉత్తరభాగంలో నిర్మించే నాలుగు వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ రీజినల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా.. హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారులోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు. అందుకే ఈ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు, నివాస సముదాయాల కోసం భూముల కోసం ఎక్కుమంది అన్వేషిస్తున్నారు.

తగ్గనున్న దూరం..

రిజనల్ రింగ్ రోడ్డు వినియోగంలోకి వస్తే.. వివిధ జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్లవచ్చు. అంతర్రాష్ట్ర వాహనాలకు దూరం తగ్గనుంది. ఫలితంగా హైదరాబాద్‌ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గే అవకాశాలున్నాయి. కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్‌ కారిడార్‌గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారితో అనుసంధానమయ్యే జిల్లాల్లోనూ వ్యాపారరంగం మరింత వృద్ధి చెందనుంది. ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనుండడంతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి.

Whats_app_banner