Karimnagar Land Mafia : కరీంనగర్ ల్యాండ్ మాఫియాపై పోలీసుల నజర్, ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఫిర్యాదులపై యాక్షన్ షురూ
Karimnagar Land Mafia : కరీంనగర్ లో ల్యాండ్ మాఫియా, భూ ఆక్రమణదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టారు. కట్టరాంపూర్ లో తప్పుడు పత్రాలతో భూమిని విక్రయించిన కేసులో నలుగురిని అరెస్టు చేశారు.

Karimnagar Land Mafia : కరీంనగర్ పోలీసులు మరోసారి ల్యాండ్ మాఫియా, భూ ఆక్రమణదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఏడాది కాలంగా స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఉద్యోగులను సైతం అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు కాస్త విరామం ఇచ్చి మళ్ళీ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టారు. అరెస్టు అయిన వారిని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తుండడంతో ఆక్రమణదారుల్లో గుబులు మొదలయ్యింది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి ఆదేశాలతో పోలీసులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రెండు రోజుల క్రితం కట్టరాంపూర్ లో సర్వేనెంబర్ 954లో 13 మంది కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి 41 గుంటల భూమిని అక్రమంగా విక్రయించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన బల్మూరి రమణారావు, దాసరి బుచ్చిమల్లారెడ్డి, దాసరి సంజీవరెడ్డి, మహ్మద్ బషీర్ లను రిమాండ్ కు తరలించారు.
అందులో ముగ్గురు రమణారావు, సంజీవరెడ్డి, మహ్మద్ బషీర్ లను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నీటిపారుదల శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సైతం ఉన్నారు. విచారణ అనంతరం వారిని సైతం అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
ఉద్యోగులపై నజర్
గత కొద్ది రోజులుగా పోలీసులు భూ కబ్జాలపై సడిచప్పుడు లేకుండా వ్యవహరించారు. వారం రోజులుగా దూకుడు పెంచి ల్యాండ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా వ్యవహరిస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో రెండు కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. రెండు కేసుల్లో మొత్తం 19 మంది ఉండగా అందులో రెవెన్యూ, మున్సిపల్, ఎస్సారెస్పీ ఉద్యోగులు సైతం ఉన్నారు. వారిపై దృష్టి పెట్టి విచారణ అనంతరం అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈవోడబ్ల్యూ కు 3121 ఫిర్యాదులు
పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈవోడబ్ల్యూ) పేరిట ఆర్థిక నేరాలు, భూ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఏళ్లతరబడి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడ్డవారంతా కమిషనరేట్ కు వరుస కట్టారు. గతేడాది మార్చి నుంచి డిశంబర్ వరకు 3,121 ఫిర్యాదులు అందాయి.
వీటన్నింటిపై దర్యాప్తులు కొనసాగించి కొంతమంది కార్పొరేటర్లతో పాటు భూమోసాల్లో ఆరితేరిన వారిని అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. తర్వాత కాస్త నెమ్మదించినా మళ్లీ ఇటీవల వరుసగా పాత దరఖాస్తులపై సీపీ నజర్ పెట్టారు.
అధికారుల్లో భయం
దాదాపు రెండు దశాబ్దాల నుంచి జిల్లాలో పని చేసి వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ ఉన్నతాధికారుల్లోను కేసుల విచారణ తీరుతో గుబులు పట్టుకుంది. గతంలో తహశీల్దార్ లుగా చేసి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ నేరాలతో సంబంధం ఉందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా భూ ఆక్రమణదారులకు సహకరించిన అధికారులను ఉపేక్షించడం లేదు.
ఇప్పటికే పోలీసు శాఖలోని పలువురిని విచారించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అదే బాటలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఉన్నవారిపైన కేసులు కట్టారు. తాజాగా మరోనాలుగైదు కేసుల్లో కీలకంగా ఉన్న రెవెన్యూ అధికారులను రేపో మాపో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
గతంలో కస్టడీకి నిందితులను విచారించిన క్రమంలో పలువురు అధికారుల పాత్రలు బయటపడ్డాయి. ఇదే తరహాలో కొందరు రాజకీయ నాయకులతోపాటు అప్పటి రెవెన్యూ అధికారుల పేర్లు తాజాగా విచారణ జరుపుతున్న కేసుల్లో వినిపిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా కరీంనగర్ కలెక్టరేట్లో కీలక హోదాల్లో ఉన్న వారి పేర్లు త్వరలోనే బహిర్గతమవుతాయని.. కీలకమైన పత్రాల సృష్టిలో వారి సహకారం ఉందనే విషయమై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రిపోర్టింగ్ : కెవి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం