Kodangal : లగచర్లలో అధికారులపై దాడి కేసు.. ట్విస్ట్ ఇచ్చిన కీలక నిందితుడు సురేష్
Kodangal : లగచర్లలో అధికారులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడు సురేష్ ట్విస్ట్ ఇచ్చాడు. కలెక్టర్ బృందంపై దాడి కేసులో సురేష్ ఏ2గా ఉన్నాడు. అతని కోసం పోలీసులు రోజుల తరబడి గాలిస్తున్నారు. తాజాగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో పరిగి డీఎస్పీపై బదిలీ వేటు వేశారు.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు సురేష్.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో సురేష్ ఏ2గా ఉన్నాడు. దాడి జరిగిన రోజు నుంచి నిందితుడు సురేష్ పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ.. అనూహ్యంగా సురేష్ పోలీసుల ముందు లోంగిపోయాడు.
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణను తొలుత ఈ నెల 7న జరపాలని నిర్ణయించారు. కానీ.. కొన్ని కారణాలతో 11వ తేదీని ఖరారు చేశారు. అయితే.. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆందోళన జరిగే అవకాశముందని.. ఇంటెలిజెన్స్ అధికారులు జిల్లా పోలీసులను ఒక రోజు ముందే అలర్ట్ చేశారు. ఆందోళన చేసే అవకాశమున్న వారి పేర్లను కూడా ఇచ్చారు. ఆ లిస్టులో కీలక నిందితుడు సురేష్ పేరు కూడా ఉంది.
ప్రజాభిప్రాయ సేకరణ జరిగే రోజు లగచర్లకు 2 కిలోమీటర్ల దూరంలో వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో 230 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు పోలీస్ వాహనాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని భావించి.. వేదికకు దూరంగా వాహనాలను ఉంచారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి కలెక్టర్ ప్రతీక్‌జైన్, కడా ఛైర్మన్ వెంకట్ రెడ్డి వేదిక దగ్గరకు వచ్చారు.
అప్పుడే వేదిక దగ్గరకు వచ్చిన సురేష్.. రైతులంతా ఊరిలో ఉన్నారని.. అక్కడికి రావాలని కలెక్టర్‌ను కోరారు. ఊరిలోకి వెళ్లేందుకు కలెక్టర్ సిద్ధం అయ్యారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే అవకాశముందని.. వెళ్లొద్దని పోలీసులు కలెక్టర్‌ను కోరారు. అయితే.. రైతులతో మాట్లాడి భూసేకరణకు ఒప్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ తన వాహనంలో ఊర్లోకి వెళ్లిపోయారు. డీఎస్పీలు సహా ఇతర పోలీసులు తమ వాహనాల్లో ఊరిలోకి వెళ్లారు.
పోలీసుల కంటే కొద్దిసేపు ముందే కలెక్టర్ గ్రామానికి చేరుకున్నారు. పాలనాధికారి కారు దిగిన వెంటనే ఆందోళనకారులు ముందుకు దూసుకొచ్చారు. క్షణాల్లోకి పరిస్థితి అదుపు తప్పింది. వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ భద్రత సిబ్బంది, మఫ్టీలో ఉన్న పోలీసులు కలెక్టర్‌ను కారులో ఎక్కించి పంపించేశారు. కానీ.. భూసేకరణలో కీలకంగా ఉన్న కడా ఛైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామస్తులకు చిక్కారు. దీంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు.
అప్పుడే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామస్తుల చేతికి చిక్కి ఉన్న వెంకట్ రెడ్డిని బయటికి తీసుకొచ్చారు. అధికారులపై దాడిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం పరిగి డీఎస్పీపై వేటు వేసింది. తాజాగా.. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగనుంది.