Warangal Subedari bungalow : 138 ఏళ్ల నాటి 'సుబేదార్ బంగ్లా' - ఇక టూరిస్ట్ స్పాట్ గా మారనుంది..!
వరంగల్ నగరంలో ఉండే సుబేదార్ బంగ్లాను హెరిటేజ్ బిల్డింగ్ గా డెవలప్ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. నిజాం కాలం నాటి ఈ నిర్మాణాన్ని… 1950 నుంచి ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీస్ గా వాడారు. దాదాపు 57 మంది కలెక్టర్లు ఇదే బిల్డింగును క్యాంప్ ఆఫీస్ గా వినియోగించారు.
నిజాం కాలంలో అప్పటి సుబేదార్ మేజర్ నివాసం కోసం నిర్మించిన హనుమకొండలోని ‘సుబేదార్ బంగ్లా’ ఇక టూరిస్ట్ స్పాట్ గా మారనుంది. ప్రస్తుతం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ గా కొనసాగుతున్న ఈ బంగ్లాను హెరిటేజ్ భవనంగా డెవలప్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
చారిత్రక నేపథ్యం ఉన్న ఆ బంగ్లాను కుడా ప్రత్యేక నిధులతో హెరిటేజ్ భవనంగా మార్చే ప్లాన్ చేస్తుండగా.. దానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆ బంగ్లాను విజిట్ చేసి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. సుబేదార్ బంగ్లాను హెరిటేజ్ భవనంగా, టూరిస్టుల సందర్శనకు అనుకూలంగా ఉండేలా ప్రతిపాదనలు చేయాల్సిందిగా సూచించారు. ఈ మేరకు దానికి అవసరమైన ప్రపోజల్స్ పై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
చెక్కుచెదరని 138 ఏళ్ల కిందటి భవనం
సుబేదార్ బంగ్లాను నిన్నమొన్నటి వరకు హనుమకొండ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ గా వినియోగించారు. కానీ ఇటీవల నిర్మించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ లోకి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ను షిఫ్ట్ చేయగా.. ఇప్పుడా సుబేదార్ బంగ్లా ఖాళీగా ఉంటోంది. దీంతోనే ఆ బంగ్లాను హెరిటేజ్ భవనంగా డెవలప్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే నిజాం కాలంలో అప్పటి సుబేదార్ నివాసంగా ఈ బంగ్లాకు 1886లో పునాదులు వేశారు. అప్పటి సుబేదార్ మేజర్ జార్జ్ పాల్మర్ భార్య ఆగస్టు 10న దీని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఆ భవన నిర్మించి 138 ఏళ్లు అవుతుండగా, ఇప్పటికీ చెక్కుచెదరకుండానే ఉండటం గమనార్హం.
ఎన్నో ప్రత్యేకతలు
- 1886లో నిర్మించిన ఈ బంగ్లాను ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో డంగు సున్నంతో దీనిని నిర్మించారు.
- బంగ్లా లోపలికి ఎంటర్ కాగానే ఎంట్రన్స్ కమాన్ కు పెద్ద సైజు గడియారం ఉంటుంది. లోపలికి వెళ్లగానే నాటి చరిత్రను కళ్లకు కట్టే భవంతి, నీటి కొలను, ఫౌంటెయిన్లు ఉంటాయి.
- భవంతి లోపల చెక్క మెట్ల నిర్మాణం కూడా ఉంటుంది. అంతేగాకుండా ఈ బంగ్లా ఆవరణలో మెట్ల బావి ఉండగా 1982 లో జవహర్ కలెక్టర్ గా ఉన్న సమయంలో పూడికతీత తీయించారు. దీంతో అందులో నిజాం కాలంనాటి కత్తులు, ఇతర సామాగ్రి లభించగా.. వాటిని రాష్ట్ర పురావస్తు శాఖకు అప్పగించారు.
- స్వాతంత్ర్యం రాకముందు వరకు సుబేదార్ నివాసంగా వాడిన ఈ భవనాన్ని ఆ తరువాత 1950 నుంచి జిల్లా కలెక్టర్ నివాసంగా మార్చారు.
- 1950 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 57 మంది కలెక్టర్లు ఇదే బిల్డింగును క్యాంప్ ఆఫీస్ గా వినియోగించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న సుబేదార్ బంగ్లా ఇప్పుడు 138వ సంవత్సరంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు హెరిటేజ్ భవనంగా డెవలప్ చేసేందుకు అడుగులు పడుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.