KTR Delhi Tour : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కేటీఆర్ బృందం భేటీ.. రోడ్ల అభివృద్ధి కోసం విజ్ఞప్తి!
KTR Delhi Tour : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు.
సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు జాతీయ రహదారి 368బీని నిర్మిస్తున్నారు. ఈ ప్రపోజల్‌ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. విస్తరణ వల్ల ఈ రహదారి వెంబడి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి మరింత అనుసంధానమవుతాయని వివరించారు. అలాగే, నేషనల్ హైవే 63కి అనుసంధానం వీలు అవుతుందని చెప్పారు.
గడ్కరీకి వినతి..
దీనికి సంబంధించి గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారని కేటీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. మానేరు నదిపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మించాలని గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. కేటీఆర్ తోపాటు సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి నితిన్ గడ్కరీని కలిసిన వారిలో ఉన్నారు.
కేసీఆర్ హయాంలో..
2017లోనే సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు హైవే నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. జనగామ, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల నుంచి కామారెడ్డి జాతీయ రహదారిని కలుపుతూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విజయవాడ, కామారెడ్డి జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తే.. భవిష్యత్తులో సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని అప్పటి సీఎం కేసీఆర్ భావించారు.
2022లోనే ప్రారంభం..
ఈ రహదారి నిర్మాణంలో భాగంగా.. జనగామ - దుద్దెడ రోడ్డు విస్తరణ పనులను 2022 లోనే ప్రారంభించారు. జనగామ నుంచి దుద్దెడ వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి రోడ్డు విస్తరణ కోసం.. కేంద్ర ప్రభుత్వం రూ.438 కోట్లు నిధులను మంజూరు చేసింది. రోడ్డు విస్తరణకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్‌అండ్‌సీ కంపెనీ ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో రూ.423 కోట్లతో టెండర్‌ను దక్కించుకున్నది.
అవాంతరాలు లేకుండా..
365బీ నేషనల్ హైవే చేర్యాల మీదుగా వచ్చి దుద్దెడ వద్ద రాజీవ్ రహదారితో కనెక్ట్ అవుతుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డులోనే భాగంగా కొనసాగనుంది. దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిని క్రాస్ చేసి సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీసు వెనుక నుంచి కోమటి చెరువు సమీపంగా.. సిద్దిపేటకు చేరుతుంది. జక్కాపురం, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, తంగళ్లపల్లి గ్రామాల వద్ద బైపాస్‌లతో రోడ్డు నిర్మించనున్నారు. సిరిసిల్ల పట్టణం వద్ద మానేరు నది మీదుగా వంతెన నిర్మిస్తారు. మధ్యలో కొన్ని చిన్న వంతెనలు కూడా నిర్మించనున్నారు. ఈ రహదారులు అందుబాటులోకి వస్తే ఎటువంటి అవాంతరాలు లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.
తెలంగాణపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణలో కొత్త రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం సహా.. హైదరాబాద్- విజయవాడ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీజినల్ రింగు రోడ్డును రెండు భాగాలుగా 350 కి.మీ మేర నిర్మిస్తుండగా.. హైదరాబాద్- విజయవాడ హైవేను నాలుగు వరసల నుంచి 6 వరసలకు విస్తరించనున్నారు.