KTR : కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ కావాలని కోరిక ఉండేది, పొలిటికల్ లీడర్ ను అయి ప్రజాసేవకు అంకితమయ్యానని స్పష్టం చేశారు. డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50% జబ్బు నయమవుతుంది, అది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని తెలిపారు.
కరీంనగర్ లో చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ డే కు కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, చైల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, వ్యవస్థాపకులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొని ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు డాక్టర్ కావాలని కోరిక ఉండేదని, కానీ ఇక్కడ బీఫార్మసీలో సీటు వచ్చిందన్నారు. కర్నాటకలో కే సెట్ రాస్తే అక్కడ డాక్టర్ సీటు వచ్చిందని, డాక్టర్ సీటు రావడంతో తనతో పాటు మా అమ్మ సంతోషపడిందని తెలిపారు.
డాక్టర్ కావాలనే కోరికతో బిజీగా ఉండే నాన్న కేసీఆర్ వద్దకు వెళ్లి చెప్పగా ఐదేళ్లు ఎంబీబీఎస్ చదవాలి... రెండేళ్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి... ఆ తర్వాత స్పెషలైజేషన్ ఉంటుందని కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపారు. వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పడంతో డాక్టర్ కావాలనే ఆలోచన విరమించుకొని డిగ్రీలో జాయిన్ అయ్యానని చెప్పారు. డాక్టర్ కావాల్సిన తాను డిగ్రీలో జాయిన్ అయి పొలిటికల్ లీడర్ ను అయ్యానని స్పష్టం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద ఛాలెంజ్ ఎదురు కాబోతుందని తెలిపారు కేటీఆర్. చాట్ జీపీటీ, గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు రాస్తున్నాయని చెప్పారు. ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కరుణ, సానుభూతితో రోగులకు డాక్టర్లు సేవ చేయాలని కోరారు.
పవిత్రమైన వృత్తి డాక్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చామని, వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో యువ డాక్టర్ లు భాగస్వాములు కావాలని కోరారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం