KTR vs Revanth Reddy : ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?.. కేటీఆర్ ఊర మాస్ కామెంట్స్
KTR vs Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో లగచర్ల లడాయి హాట్ టాపిక్‌గా మారింది. సీఎం సొంత నియోజకవర్గంలో అధికారులపై దాడి ఘటన.. పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే.. కేటీఆర్ ఆదేశాలతోనే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
'ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? రూ.50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..
లగచర్ల ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కడా స్పెషల్ ఆఫీసర్, వికారాబాద్ అడిషనల్ కలెక్టర్‌పైనా హత్యాయత్నం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. అధికారులపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని.. ముదుగానే రాళ్లు, కర్రలు, కారంపొడి సేకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.
19 మందికి భూమే లేదు..
ఈ కేసులో మరో కీలక అంశం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై దాడి ఘటన నిందితుల్లో 19 మందికి అసలు భూమే లేదని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీంతో నిజంగా భూమి ఉన్నవారు ఆందోళన చేస్తే.. ఏమో అనుకోవచ్చు గానీ.. భూమిలేని వారు ఎందుకు అధికారులపై దాడి చేస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత చర్యేనని ఆరోపిస్తోంది. దీని వెనక కేటీఆర్ ఉన్నారని కాంగ్రెస్ లీడర్లు గట్టిగా చెబుతున్నారు.