Delhi election Results : బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. కేటీఆర్ సెటైర్లు-ktr satires on rahul gandhi over bjp victory in delhi assembly elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delhi Election Results : బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. కేటీఆర్ సెటైర్లు

Delhi election Results : బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. కేటీఆర్ సెటైర్లు

Basani Shiva Kumar HT Telugu
Published Feb 08, 2025 11:53 AM IST

Delhi election Results : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో అయ్యింది. ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చూపలేదు. అన్ని చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.

కేటీఆర్
కేటీఆర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. రౌండ్‌ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యాలతో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. ఊహించని అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కానీ.. కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో హస్తం పార్టీపై పంచ్‌లు పేలుతున్నాయి.

కంగ్రాట్స్ రాహుల్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ సెటైర్లు వేశారు. 'బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తున్నారు.

భూములను చెరబడుతున్నారు..

ఇటు తెలంగాణ ప్రభుత్వంపైనా కేటీఆర్ ఫైర్ అయ్యారు. 'తొలి గండం దాటితే తొంభై ఏండ్ల ఆయుష్షు అని పెద్దల మాట. అల్లుని కంపెనీల కోసం, అదానీ పరిశ్రమల కోసం, అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం, ఢిల్లీకి మూటల చేరవేత కోసం.. పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని, లాఠీల దెబ్బలు తిని, చేతులకు బేడీలు వేసుకొని, నెలలపాటు చెరసాలల పాలైనా.. భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టువదలడం లేదు' అని కేటీఆర్ విమర్శించారు.

దినదిన గండంగా తెలంగాణం..

'పట్నంలో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు, పాలడబ్బాలు, చెప్పుల దుకాణాలు.. పల్లెల్లో పేదల భూములు, గరీబోళ్ల ఇండ్లు, పంట పొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారులు స్వైర విహారం చేస్తున్నారు. కాదేది అణచివేతకు అనర్హం అన్నట్టు.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి. దినదిన గండంగా తెలంగాణం.. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

3 ఎమ్మెల్సీలు గెలవాలి..

ఇటు ఢిల్లీ ఫలితాలపై తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో కిషన్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. ఢిల్లీ గెలుపుతో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీజేపీ అంటేనే ఓ నమ్మకం అని అన్నారు. నిజాయితీ పాలన బీజేపీతోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురుతో ఊడ్చేశారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకున్నారని.. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న సంజయ్.. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

అన్నా హజారే స్పందన..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్న హజారే.. లిక్కర్‌ స్కామ్‌తో కేజ్రీవాల్‌ అప్రతిష్ఠపాలయ్యారని వివరించారు. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారని అన్నా హజారే స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ ఫలితాలపై బీజేపీ జోష్‌లో ఉంది. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో సంబరాలకు ఏర్పాట్లు చేస్తోంది. సంబరాలకు హాజరుకానున్నారు ప్రధాని మోదీ.

Whats_app_banner