TG Welfare Schemes : భట్టి గారూ.. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా? : కేటీఆర్
TG Welfare Schemes : తెలంగాణలో పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. అయితే.. కేవలం మండలానికి ఒక్క గ్రామంలోనే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంది. కేటీఆర్ దీనిపై సెటైర్లు పేల్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక గ్రామంలో జనవరి 26న 4 పథకాలకు సంబంధించి నూరు శాతం అమలు చేయబోతున్నట్లు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చినందునా.. మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఎవరూ మిగిలిపోరు..
ఈ ప్రక్రియలో ఎవరూ మిగిలిపోరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని, భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే.. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. ప్రశ్నలు సంధించారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
'భట్టి గారు.. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా? మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా? మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా? మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా? మండలానికి ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
నేడు కొందరికే కొన్ని..
'నాడు అందరికీ అన్నీ అని.. నేడు కొందరికే కొన్ని పేరిట మభ్యపెడితే.. నాలుగు కోట్ల తెలంగాణ మీ నయవంచనను క్షమించదు.. ఎన్నికలప్పుడు.. రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని.. ప్రతి ఇంటా.. అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. వన్ ఇయర్ తరువాత వన్ విలేజ్ అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే. ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ.. ఏరు దాటక తెప్ప తగలేసే మీ ఏడాది దగా పాలన చూసిన తరువాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 'గుర్తుపెట్టుకోండి..పథకాలు రాని గ్రామాల్లో రేపటి నుంచి ప్రజా రణరంగమే' అని స్పష్టం చేశారు.
పొంగులేటి వెర్షన్..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం.. చిత్తశుద్ధితో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రతి అంశాన్ని ప్రజల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకునే అలవాటు ఈ ప్రభుత్వానిదని స్పష్టం చేసారు. అందుకే గ్రామ సభలు నిర్వహించి.. ప్రజల వద్దనుంచి అప్లికేషన్లు స్వీకరించామని చెప్పారు.