KTR : నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు.. అదే నిజమైతే దగ్గరుండి కూలగొట్టిస్తా - కేటీఆర్-ktr said that i dont own any house in janwada ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు.. అదే నిజమైతే దగ్గరుండి కూలగొట్టిస్తా - కేటీఆర్

KTR : నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు.. అదే నిజమైతే దగ్గరుండి కూలగొట్టిస్తా - కేటీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 21, 2024 02:21 PM IST

తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఫామ్ హౌస్ ను లీజుకు మాత్రం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి కడితే దగ్గరుండి కూలగొటిస్తానని వ్యాఖ్యానించారు.

తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్
తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్

జన్వాడలోని ఫామ్ హౌస్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని చెప్పారు. ఆ ఫామ్ హౌస్ ను లీజుకు మాత్రం తీసుకున్నానని వివరించారు.

నిబంధనలు ఉల్లంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ను నిర్మించి ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కేటీఆర్ చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పలువురు కాంగ్రెస్ మంత్రులతో పాటు పెద్ద నాయకుల ఫామ్ హౌస్ లను కూడా కూడా పరిశీలించాలని వ్యాఖ్యానించారు.

“సోషల్ మీడియాలో పలువురు కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ ల ఫొటోలు బయటికి వచ్చాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి, కేవీపీ , మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు చాలా మంది నేతల ఫామ్ హౌసులు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఎక్కడ ఉందో కూడా చూపిస్తా. నాపేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదు. తప్పు జరిగితే హైడ్రాను తీసుకెళ్లి అన్నింటిని కూల్చివేద్దాం. మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలి ” అంటూ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

రుణమాఫీ బూటకం - కేటీఆర్

కాంగ్రెస్ చేస్తున్న రుణమాఫీ బూటకం, పచ్చి దగా, పచ్చి మోసం అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి బండారం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బట్ట బయలైందన్నారు.

“వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రూ. 2 లక్షలు మాఫీ చేశాం అంటూ ప్రకటన చేశారు. కానీ కొన్ని పత్రికలు రుణం పూర్తిగా మాఫీ కాలేదంటూ వార్తలు రాశాయి. జరిగింది రుణమాఫీ కాదు… పెట్టింది రైతులకు టోపీ. ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు బ్యాంకులను ముట్టడిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంది కానీ జరిగింది మోసం. రుణమాఫీ జరగలేదు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం లో బజార్ హత్నూర్ లో రైతుల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏ పార్టీ ప్రేరేపించకుండా రైతులు ఆందోళన చేస్తున్నారు. రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే రైతులకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కేసులు పెట్టి వేధిస్తుంది ఈ ప్రభుత్వం. రైతుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుంది రెండు లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందంటాడు. ముఖ్యమంత్రికి మంత్రులకు అసలు సయోధ్య లేదు. మనిషికి ఒక్క మాట మాట్లాడుతున్నారు.. రుణమాఫీ వట్టిదే అని మంత్రుల మాటలతో తేలిపోయింది. సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సాంకేతిక కారణాలు ఏమీ లేవు. రుణమాఫీ ఎగ్గొట్టేందుకే ఇలా కారణాలు చెబుతున్నారు” అని కేటీఆర్ ఆక్షేపించారు.

రేపు ధర్నాలు చేస్తాం…

కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి నిరసనగా రేపు రైతులతో కలిసి ధర్నా చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. “కాంగ్రెస్ డ్రామాలు ఇక నడవవు. రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారో చెప్పాలి. రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? మొత్తంగా వీళ్లందరి మాటలు వింటే జరిగింది పావు శాతం రుణమాఫీ కూడా లేదని తేలిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయమన్నందుకు ముఖ్యమంత్రి మాట్లాడిన బజారు భాషకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రేపటి ధర్నాను ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి. రైతులపై కేసులు మానుకోకుంటే జైలు భరో కార్యక్రమానికి కూడా పిలుపు ఇస్తాం. లక్షలాది మంది రైతులు, మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెడతారా? ఈ దగాకోరు సర్కార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని కేటీఆర్ హెచ్చరించారు.

టాపిక్