KTR ACB Case : ఇప్పుడు ఏం చేద్దాం.. కీలక నేతలతో కేటీఆర్ మంతనాలు.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన!
KTR ACB Case : కేటీఆర్ ఏసీబీ కేసు మరో మలుపు తిరిగింది. ఆయన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ కీలక నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తదుపరి ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు సమాచారం.
హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తన లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపారు. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లాలా? లేదా? అనే దానిపై సమాలోచనలు చేశారు. ఇప్పుడు ఏసీబీ తీసుకునే నిర్ణయంపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అటు కేటీఆర్ అరెస్టు తప్పదని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తున్నారు.
కేటీఆర్ పాత్ర ఉందని..
ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని హైకోర్టు అభిప్రాయ పడింది. కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించింది. ఏసీబీ వాదనల వైపే హైకోర్టు మొగ్గు చూపింది. ప్రజా ప్రతినిధిగా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ లేదని కేటీఆర్ వాదనలు వినిపించారు. అయితే.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి జరిపిన చెల్లింపులతో ఐటీ శాఖకు దాదాపు రూ.8 కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ హైకోర్టులో వాదించింది.
మంత్రిగా ఉన్నప్పుడు..
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. తాజాగా.. హైకోర్టు నిర్ణంతో ఏసీబీ ఎలా వ్యవహరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈడీ విచారణకు కేటీఆర్ ఇవాళ హాజరు కావాల్సి ఉండగా.. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని కేటీఆర్ లేఖ రాశారు. అటు ఈడీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.
ఉపశమనం కోసం..
ఈ నేపథ్యంలో.. కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కువమంది నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. హైకోర్టు నిర్ణయంతో.. కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఏసీబీ రెడీ అయితే కష్టమని.. అందుకే ముందుగానే సుప్రీంకోర్టుకు వెళితే ఉపశమనం లభించే అవకాశం ఉందని నేతలు చెప్పినట్టు తెలిసింది.
కాంగ్రెస్ కామెంట్స్..
హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. దొంగలు, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేవారికి కోర్టులు సపోర్ట్ చేయవని కేటీఆర్ తెలుసుకోవడం మంచిదన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన ఆర్థిక నేరంపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.