అంతర్గత పోరు నిజమేనా...? బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..?-ktr meets harish rao what is happening in the brs party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అంతర్గత పోరు నిజమేనా...? బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..?

అంతర్గత పోరు నిజమేనా...? బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..?

గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కవిత చేసిన సామాజిక తెలంగాణ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు తాజాగా కేటీఆర్… హరీశ్ రావు ఇంటికెళ్లారు. రెండు గంటలకుపైగా చర్చలు జరిపారు. దీంతో పార్టీలో అసలేం జరుగుతోందన్న చర్చ జోరందుకుంది.

బీఆర్ఎస్ పార్టీ

రజతోత్సవ సభ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో సభ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించగా…ఆ తర్వాత అనూహ్యంగా పక్కకి తప్పుకున్నారు. ఆపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అన్నీ తానై వ్యవహరించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎమ్మెల్యే కవిత కూడా… కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె…. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాకారమైందని… సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాదు… రాజకీయవర్గాల్లోనూ తీవ్రస్థాయిలో చర్చకు దారి తీశాయి. దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందన్న డిస్కషన్ జోరుగా జరుగుతోంది.

బీఆర్ఎస్ లో ఎందుకిలా..?

అధికారం కోల్పోయిన తర్వాత…. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ లైన్ లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన ఆ పార్టీ…. ఆ తర్వాత ఒక్కో కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలను బలంగా చేసింది. ఈ విషయంలో సక్సెస్ అవుతూనే వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజారనివ్వకుండా సద్వినియోగం చేసుకున్నట్లు కనిపించింది. అసెంబ్లీ వేదికగా ఆ పార్టీ నేతలు ధీటుగా బదులిచ్చారు. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావ్ అన్నీ తామై వ్యవహరించారు.

కట్ చేస్తే పార్టీ రజతోత్సవ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాలుగైదు నెలలుగా కసరత్తు చేయగా… ఏప్రిల్ లో సభను నిర్వహించింది. భారీ స్థాయిలో జనసమీకరణ చేయటంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే సభ తర్వాత అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి సభ ఏర్పాట్ల బాధ్యతలను ముందుగా హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో ఆయన పలుమార్లు క్షేత్రస్థాయిలో కూడా పర్యటించారు. సభ కోసం స్థలాలను కూడా పరిశీలించారు. అయితే ఉన్నట్టుండి… హరీశ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ సీన్ లోకి వచ్చారు. అయితే హరీశ్ రావును తప్పించారా..? లేక తప్పుకున్నారా..? అన్న చర్చ గట్టిగా జరిగింది.

ఇక రజతోత్సవ సభ వేదికపై కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను మాత్రం ప్రదర్శించారు. ఏ ఇతర నాయకుల ఫొటోలకు కూడా అవకాశం కల్పించలేదు. ఈ విషయంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ కు పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించే కోణంలోనే ఇదంతా జరుగుతుందా..? అన్న చర్చ జోరుగా తెరపైకి వచ్చింది.

చిచ్చు రేపిన సామాజిక తెలంగాణ కామెంట్స్..!

మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. బీసీ అజెండాతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ జెండా కాకుండా…. కవిత కేంద్రంగానే ఇదంతా నడుస్తోంది. జిల్లా పర్యటనలు చేస్తూ తమ మార్క్ ను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే మే డే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె… కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది.

“భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం. భూమి ఉన్న వాళ్లకే పంట పెట్టుబడి సాయం ఇచ్చాం. కానీ ఏమీ లేనివాళ్లకు ఏం చేయలేకపోయాం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి. గత పదేళ్ల పాటు అధికారంలోకి ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే కదా… సామాజిక తెలంగాణ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోయారంటూ ప్రశ్నలు ఎక్కుబెట్టారు. అంతేకాదు… రైతుబంధు విషయంలో పలు ప్రశ్నలను సంధించారు. కవిత వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కూడా సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు అయింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ చర్చనీయాంశంగా మారిపోయాయి.

ఇటీవలే మీడియాతో మాట్లాడిన కవిత… తనపై కుట్రలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. వాళ్లెవరో తనకు తెలుసని… టైమ్ వచ్చినప్పుడు బయటపెడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత పార్టీపై కూడా ఉందంటూ ఆవేదనను వ్యక్తపరిచేలా మాట్లాడారు. అయితే కవితపై ఎవరు కుట్ర చేస్తున్నారు..? ఎవర్నీ ఉద్దేశించి ఆమె… ఈ వ్యాఖ్యలు చేసిందన్న డిస్కషన్ రాజకీయవర్గాల్లో గట్టిగా జరుగుతోంది.

హరీశ్ ఇంటికి కేటీఆర్…!

మరోవైపు పార్టీ నాయకత్వంపై హరీశ్ అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. కొత్త పార్టీ ఏర్పాటు కూడా అంటూ వార్తలు వచ్చాయి. వీటిని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తాను కేసీఆర్ సైనికుడినని.. ఆయన మాటే తనకు శిరోధార్యమని బదులిచ్చారు. కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించినా…తాను సహకరిస్తానని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిామాండ్ చేశారు. మరోవైపు హరీశ్ రావు తరపున పార్టీ నేతలు కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… హరీశ్ రావ్ నివాసానికి వెళ్లారు. ఏకంగా 2 గంటల పాటు చర్చించారు. పార్టీకి సంబందించిన పలు కీలకాంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అనారోగ్యంతో ఉన్న హరీశ్‌రావు తండ్రిని పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ… సుదీర్ఘంగా భేటీ కావటం అందరి దృష్టిని ఆకర్షించింది.

రజతోత్సవ సభ అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల తర్వాత… కేటీఆర్‌, హరీశ్‌రావు భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నట్లు అయింది. అయితే పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశం ద్వారా… పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్న సంకేతాలను పార్టీ శ్రేణుల్లోకి పంపే ప్రయత్నం జరిగినట్లు విశ్లేషణలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా… ఇవాళ హరీశ్ రావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. దీనికి కేటీఆర్ కూడా హాజరుకానున్నట్లు తెలిసింది.

గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ మార్పు విషయంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా హరీశ్ రావు కేంద్రంగా అనేక వార్తలు వచ్చినప్పటికీ… ఆయన కొట్టిపారేశారు. పార్టీ మారే ప్రసక్తే ఉండదని… కేసీఆర్ బాటే తన బాట అని స్పష్టం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి..! ఈసారి కూడా ఎప్పటి మాదిరిగానే సమసిపోతుందన్న వాదనను కూడా పార్టీలో పలువురు నేతలు వినిపిస్తున్నారు…! మొత్తంగా ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో…. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది..? అంతర్గత పోరు నిజమేనా…? ఎవరి ఆలోచన ఏంటన్న..? ప్రశ్నలు మాత్రం సామాన్య కార్యకర్త మదిని గట్టిగా తొలచివేస్తున్నాయి…!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం