Singareni Coal Mines : సింగరేణి బొగ్గు గనుల వేలంలో పాల్గొనకండి - ప్రైవేట్ కంపెనీలకు KTR ముందస్తు హెచ్చరికలు..!
KTR On Singareni Coal Mines Auction : సింగరేణి గనుల వేలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ బొగ్గు గనులను దుర్మార్గంగా వేలం వేయబోతున్నారని దుయ్యబట్టారు.
KTR On Singareni Coal Mines : బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… 16 సీట్లు వచ్చిన టీడీపీ ఆంధ్రాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే వాళ్లే మన సింగరేణిని ఖతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే రక్షణ కవచమని కేసీఆర్ వేల సార్లు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. దానికి గొప్ప ఉదాహరణే రేపు జరగబోయే బొగ్గు గనుల వేలమని వ్యాఖ్యానించారు. “మాకు 16 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే 16 సీట్లతో ఏం చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కానీ ఇప్పుడు మన బొగ్గు గనులను దుర్మార్గంగా వేలం వేయబోతున్నారు. గతంలోనే వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని కేసీఆర్ కేంద్రానికి ఉత్తరం రాశారు. కేసీఆర్ ఉత్తరం రాసిన వెంటనే అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కూడా సింగరేణికి కోల్ బ్లాక్‌ల వేలం ఉండొద్దని కేంద్రానికి లేఖ రాశారు. కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని ఇప్పుడు కోల్ బ్లాక్‌ల వేలానికి మద్దతు తెలుపుతున్నారు..?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసుల భయమా..?
కేసుల భయమా? రేవంత్ రెడ్డి గారికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే.. అప్పుడు కూడా ఎలాంటి వేలం లేకుండా లిగ్నైట్ గనులను కేటాయించారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదు? అని నిలదీశారు. దీని వెనుక సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
“వేలం పాటలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొంటుందో చెప్పాలి? పదేళ్లు మా మెడ మీద కత్తి పెట్టిన మేము ఆక్షన్ జరగనివ్వకుండా అడ్డుకున్నాం. సింగరేణి కార్మికుల సత్తా ఏంటో మనం ఉద్యమ సమయంలో చూశాం. అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. అలాంటి సింగరేణిని ఖచ్చితంగా బీఆర్ఎస్ కాపాడుకుంటుంది” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ఇస్తే.. వాళ్లు ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నిర్ణయానికి సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు వంత పాడుతున్నారు? ప్రశ్నించారు. గతంలో తాము పోరాటాలు చేసి సింగరేణిని కాపాడుకున్నామన్నారు.
“ఇప్పుడు కూడా సింగరేణిని మళ్లీ కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. మన బొగ్గును మనకు కేటాయించకపోవటం చాలా అన్యాయమైన పని. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి. మళ్లీ మా ప్రభుత్వం వస్తది.. అప్పుడు ఈ నిర్ణయాన్ని సమీక్షించి అడ్డుకుంటాం. వేలంలో పాల్గొనబోయే ప్రైవేట్ కంపెనీలకు మేము ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. ఇకనైనా బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి. దీనిపై భవిష్యత్ కార్యాచరణనను కూడా రెండు, మూడో రోజుల్లో ప్రకటిస్తాం” అని కేటీఆర్ తెలిపారు.