Formula E Case : ఫార్ములా-ఈ రేస్ కేసు, గ్రీన్ కో సంస్థల్లో ఏసీబీ సోదాలు-వెలుగులోకి కీలక విషయాలు!-ktr formula e race case acb raids on greenko office in ap telangana sensational information coming out ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Case : ఫార్ములా-ఈ రేస్ కేసు, గ్రీన్ కో సంస్థల్లో ఏసీబీ సోదాలు-వెలుగులోకి కీలక విషయాలు!

Formula E Case : ఫార్ములా-ఈ రేస్ కేసు, గ్రీన్ కో సంస్థల్లో ఏసీబీ సోదాలు-వెలుగులోకి కీలక విషయాలు!

Bandaru Satyaprasad HT Telugu
Jan 07, 2025 02:59 PM IST

Formula E Case : ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఏపీ, తెలంగాణలోని గ్రీన్ కో ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఫార్ములా ఈ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించింది.

ఫార్ములా-ఈ రేస్ కేసు, గ్రీన్ కో సంస్థల్లో ఏసీబీ సోదాలు-వెలుగులోకి కీలక విషయాలు!
ఫార్ములా-ఈ రేస్ కేసు, గ్రీన్ కో సంస్థల్లో ఏసీబీ సోదాలు-వెలుగులోకి కీలక విషయాలు!

Formula E Case : ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో...ఏసీబీ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో భాగంగా ఏసీబీ అధికారులు ఏపీలో సోదాలు చేపట్టారు. గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నంలో ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు చేసి, ప్రింటర్స్ తీసుకువెళ్లారు. పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సేకరించారు.

yearly horoscope entry point

గ్రీన్ కో కార్యాలయాల్లో సోదాలు

అలాగే ఏపీ, తెలంగాణలోని గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి మాదాపూర్‌లోని గ్రీన్ కో ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ లోనూ సోదాలు చేపట్టారు. మచిలీపట్నంలోని గ్రీన్ కో ఆఫీసులో మొత్తం 12 మంది ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి నిధులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారుల టీమ్ తనిఖీలు చేస్తుంది. చలమశెట్టి సునీల్‌కు చెందిన గ్రీన్ కో సంస్థ అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

తెరపైకి ఎలక్ట్రోరల్ బాండ్ల వ్యవహారం

ఫార్ములా-ఈ రేస్ దర్యాప్తులో గ్రీన్‌కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫార్ములా-ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు రావడంపై ఏసీబీ దృష్టిపెట్టింది. 2022 అక్టోబరు 25న రేసు నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబర్ లో రూ.10 కోట్లు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ కు ఎలక్టోరల్‌ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.45 కోట్ల బదిలీకి అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ డబ్బు ఏ ఖాతాలకు వెళ్లిందని ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

కేటీఆర్ కు ఈడీ నోటీసులు

ఫార్ములా-ఈ కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న విచారణకు రావాలని సోమవారం కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ కేటీఆర్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని కోరింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్

ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలంటూ కోరింది.

Whats_app_banner

సంబంధిత కథనం