KTR ACB Investigation : 'ఆ ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు' - ముగిసిన కేటీఆర్ విచారణ, ఏం చెప్పారంటే..?
Hyderabad Formula E Race case Updates : కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఆరు గంటలకుపైగా సాగిన విచారణలో.. పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్…రేవంత్ రెడ్డి ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారంటూ చెప్పుకొచ్చారు.
ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. గురువారం ఏసీబీ కార్యాలయం లోపలికి న్యాయవాదితో కలిసి కేటీఆర్ వెళ్లారు. 6 గంటలకుపైగా కేటీఆర్ ను విచారించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్ తరపున అడ్వొకేట్ రామచంద్రరావును అనుమతించారు.
ఏసీబీ ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన కేటీఆర్ మాట్లాడుతూ… ఇది ఒక చెత్త కేసు అని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4 ప్రశ్నలు పట్టుకొని… 40 రకాలుగా అడిగారని వ్యాఖ్యానించారు. ఇది అసంబద్ధమైన కేసు అని చెప్పారు. మళ్లీ ఏసీబీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని స్పష్టం చేశారు.
“ రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగైదు ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి 40 రకాలుగా ఏసీబీ అధికారులు అడిగారు. నాకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పాను. విచారణకు పూర్తిగా సహకరించా. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తాను” అని కేటీఆర్ చెప్పారు.
ఏసీబీ వాళ్లే ఇబ్బందిపడ్డారు - కేటీఆర్
విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉదయం నుంచి సంఘీభావంగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా అత్యంత నిబద్ధతతో, అవినీతి రహితంగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించినట్లు ఏసీబీకి చెప్పానని వెల్లడించారు.
“ప్రశ్నలు అడిగే విషయంలో వారు కూడా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే ఈ కేసులో ఎలాంటి అవినీతి లేదు. అడిగిన ప్రశ్నలనే పదేపదే ఏసీబీ అడిగింది. ఇక్కడి నుంచి పోయిన కేసులు ఫార్ములా-ఈ సంస్థ వద్ద ఉన్నాయని చెప్పాను. మరి అలాంటి పరిస్థితిలో కేసు ఎక్కడ ఉందని ప్రశ్నించాను. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాను. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలతో మళ్లీ పిలిస్తే కూడా మళ్లీ వెళ్తాను. అవినీతి లేని కేసులో అవినీతి గురించి ప్రశ్నించడం ఏమైనా వింత కాకపోతే ఏమిటి?” అని కేటీఆర్ కామెంట్స్ చేశారు.
“న్యాయస్థానాలపై, కోర్టులపై నమ్మకం ఉంది. తప్పకుండా సహకరిస్తాం. ఇది ముమ్మాటికి లొట్టపీసు కేసే. ఆయన లొట్టపీసు ముఖ్యమంత్రే. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను స్థానం పొందేలా చేయాలన్న కమిట్‌మెంట్ మాది... మా కేసీఆర్ గారి కమిట్‌మెంట్. 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగలం మేము కాదు. మాకు భయం లేదు. సంవత్సరం తర్వాత కూడా నిన్ను ప్రజలు గుర్తుపెట్టుకోకపోతే, మేమేం చేయగలం?” అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
సంబంధిత కథనం