వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో.. ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయింది దీపిక. ఆమెకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేస్తానని..కేటీఆర్ గత నెల 16న మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. రూ.5 లక్షల చెక్కును దీపిక, మదన్ కుటుంబ సభ్యులకు పంపారు. ఆ చెక్కును నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దీపిక, ఆమె సోదరుడికి అందించారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల్ తండాలో దీపిక కుటుంబం ఉండేది. మహబూబాబాద్ జిల్లా గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు దీపిక కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో దీపిక తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయారు. దీపికకు, ఆమె సోదరుడు మదన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
గతంలో నాగరాజు, దీపిక ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. దీంతో దీపిక పదాహరు చింతల్ తండాలోని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే.. దీపికను ఆమె కుటుంబ సభ్యులే తనకు దూరం చేశారన్న కోపంతో.. నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిని హత మార్చేందుకు ప్లాన్ వేసి కత్తితో నరికి చంపేశాడు.
తల్లిదండ్రులు హత్యకు గురై రోడ్డున పడిన ఆ ఇద్దరు పిల్లలను ఆదుకునేందుకు కేటీఆర్ ముందుకొచ్చారు. ఆ ఇద్దరిని ఆదుకునేందుకు పార్టీ తరఫున రూ.5 లక్షలు సాయం చేస్తామని చెప్పారు. వారిద్దరి చదువు బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.