Formula E Car Race Case : ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్.. కీలక విషయాలు వెల్లడి-ktr filed affidavit in the high court regarding the formula e car race case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Car Race Case : ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్.. కీలక విషయాలు వెల్లడి

Formula E Car Race Case : ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్.. కీలక విషయాలు వెల్లడి

Formula E Car Race Case : ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మాజీమంత్రి కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. డబ్బుల చెల్లింపుతో తనకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో రిప్లై అఫిడవిట్ వేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తన సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంక్‌దే అని కేటీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సంబంధం లేదు..

డబ్బుల చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్ఎండీఏనే చూసుకోవాలన్న కేటీఆర్.. రూ. 10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. నిధుల బదిలీతో మంత్రిగా తనకు సంబంధం లేదని కేటీఆర్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. కేటీఆర్ అఫిడవిట్ ఈ కేసులో కీలకంగా మారనుందని తెలుస్తోంది.

ఈడీకి వివరాలు..

ఫార్ములా- ఈ కారు రేసింగ్ కేసులో వివరాలను తెలంగాణ ఏసీబీ ఈడీకి అందజేసింది. ఆర్థికశాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, ఒప్పంద పత్రాలతో పాటు.. ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఈడీకి అందజేసింది. ఫార్ములా- ఈ కారు రేసింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసింది. కౌంటర్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు.. నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని కౌంటర్‌లో ఏసీబీ పేర్కొంది.

విచారణకు రండి..

2025 జనవరి 7వ తేదీన కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి(ఏ3)లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరిని జనవరి 2, 3 తేదీల్లో ఈడీ విచారించనుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీ విచారణ జరుపుతోంది.

కేటీఆర్ వెళ్తారా..

ఫార్ములా ఈ- కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసును సవాల్ చేస్తూ.. కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఏసీబీ కేసుపై న్యాయపోరాటం చేస్తున్న కేటీఆర్.. ఈడీ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ విచారణకు హాజరవుతారా? లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.