BRS Party : 'ఎప్పటికైనా తల వంచం' - పార్టీ విలీన వార్తలను ఖండించిన కేటీఆర్, చర్యలు తీసుకుంటామని వార్నింగ్
బీఆర్ఎస్ విలీనమంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ వస్తున్న వార్తలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
“24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో, అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప్రథానంగా నిలిపాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది” అని ఓ ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందంటూ మంగళవారం ఓ మీడియాలో వార్తలను ప్రసారం చేసింది. ఢిల్లీ వేదికగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఢిల్లీలో ఎన్నికలు పూర్తి కాగానే బీఆర్ఎస్ పార్టీ...బీజేపీలో విలీనం అవుతుందని తెలిపింది. ఈ వార్తలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.
తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీపై ఉన్న ద్వేషంతోనే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విలీనమనే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే…. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఈ వార్తలపై స్పందిస్తూ తాజా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని… ఎవరికి తలవంచమని స్పష్టం చేశారు.
మేడిగడ్డ టూర్ ఎఫెక్ట్ - బీఆర్ఎస్ నేతలపై కేసు….
జులై 26న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ను విజిట్ చేయగా, ఆ తరువాత ఆయనతో పాటు ప్రాజెక్టును సందర్శించిన మరికొందరు నేతలపైనా మహాదేవపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో మరోసారి కలవరం మొదలైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎన్డీఎస్ఏ విచారణ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిత్యం చర్చల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే భారీ వర్షాలు కురవడం, పైనుంచి వచ్చే వరదతో కాళేశ్వరం నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలడం స్టార్ట్ చేశారు.
దీంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను కాంగ్రెస్ నేతలు భూతద్దంలో చూపుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఈ మేరకు ప్రాజెక్టును సందర్శించి అసలు విషయాలను ప్రజలకు వివరించేందుకని కేటీఆర్ జులై 26 మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు.
తన వెంట బీఆర్ఎస్ లీడర్లు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ సహా మరికొంతమందిని తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్ధంలో చూపి కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. అబద్దాలతో కాలం గడిపే కాంగ్రెస్ నేతలు కళ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ అండ్ టీమ్ మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు డ్రోన్ సహాయంతో మేడిగడ్డ విజువల్స్ చిత్రీకరించారు. ఆ తరువాత ప్రాజెక్టుకు సంబంధించిన విజువల్స్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ వినియోగించడానికి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు.
మీడియాలో ప్రసారమైన మేడిగడ్డ విజువల్స్ పరిశీలించిన ఇరిగేషన్ ఏఈఈ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి, అనుమతి లేకుండా డ్రోన్ విజువల్స్ తీసి విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల బ్యారేజ్‌కు ముప్పు పొంచి ఉందని అధికారులు భావించారు. ఈ మేరకు అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా, అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేయడంతో పాటు విజువల్స్ తీసినందుకు సదరు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఈఈ జులై 29న మహదేవ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సెక్షన్ 223(B) r/w 3(5) BNS కింద కేటీఆర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో హాజరు కావాల్సిందిగా కేసీఆర్ ను నోటీసులు జారీ కాగా, ఇప్పుడు కేటీఆర్ పై కేసు నమోదు కావడం పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది.
టాపిక్