Telangana Politics : తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ కాంగ్రెస్ సర్కారుతో జర పైలం : కేటీఆర్-ktr criticizes congress government policy towards farmers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Politics : తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ కాంగ్రెస్ సర్కారుతో జర పైలం : కేటీఆర్

Telangana Politics : తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ కాంగ్రెస్ సర్కారుతో జర పైలం : కేటీఆర్

Basani Shiva Kumar HT Telugu
Published Feb 15, 2025 10:20 AM IST

Telangana Politics : బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నీటి తీరువాను రద్దు చేసింది. మళ్లీ ప్రస్తుతం నీటి పన్నుతో రైతులను వేధిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నిన్న గేటు ఎత్తుకెళ్లారు.. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు.. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

కేటీఆర్
కేటీఆర్

బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన నీటితీరువాను.. ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా అని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న గేటు ఎత్తుకెళ్లారు.. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు.. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా అని నిలదీశారు. తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలం.. అని కేటీఆర్ హెచ్చరించారు.

ఇంత కక్షనా..

'అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా.. కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్‌కు ఇంత కోపమా.. సాగు నీళ్లిచ్చే సోయి లేదు.. పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు. కానీ.. రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా.. తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా.. ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా' అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ దుర్మార్గాలేంటీ..

'రూ.2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని నాయకులు ఇంత దారుణానికి ఒడిగడతారా.. రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి.. రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా.. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి.. మళ్లీ అప్పులపాలయ్యేలా చేసిన పాపం మీది కాదా కాదా.. ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటి.. మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి' అని కేటీఆర్ నిలదీశారు.

రైతాంగం సహించదు..

'వ్యవసాయరంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి.. సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను.. తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదు. సంఘటితంగా పోరాడుతది.. సీఎంకు బుద్ధి చెబుతది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఏం జరిగింది..

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలో లింగాల గ్రామం ఉంది. దీని చుట్టుపక్కల.. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఎల్‌-27 మహాత్మాగాంధీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా.. పంటలను సాగు చేస్తున్నారు. రైతులు లిఫ్ట్‌ కాల్వలకు మోటర్లు వేసుకుని పంటలు పండిస్తున్నారు. అయితే.. నీటి పన్ను కట్టలేదని లింగాల గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన మోటర్‌ స్టార్టర్‌ పెట్టెలను లష్కర్లు తీసుకెళ్లారు. భూములు నెర్రెలు పట్టి పొలాలు ఎండిపోతున్న పరిస్థితుల్లో.. స్టార్టర్లు తీసుకుపోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపైనే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner