KTR Challenge : 'రేవంత్ రెడ్డి ... లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ, నువ్వు సిద్ధమా..? కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డి కక్ష్యసాధింపు చర్యలో భాగంగానే తనపై కేసు నమోదైందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసు ఉంది కాబట్టే… తనపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫార్ములా ఈరేస్ కేసులో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశారు.
ఫార్ములా-ఈ రేసులో ఒక్క పైసా అవినీతి జరగకున్నా కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం కేస్ పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… ఏసీబీ, ఈడీ రెండు సంస్థలు అడిగిన ప్రశ్నలే గంటల తరబడి అడిగారని చెప్పారు. ఎన్ని సార్లు విచారణకు పిలిచిన హాజరవుతానని… ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తాని ఉద్ఘాటించారు.
“రేవంత్ తో లై డిటెక్టర్ టెస్ట్ కైనా నేను సిద్దం. ఇద్దరం న్యాయమూర్తి ముందు కూర్చుందాం. ప్రజలందరూ చూస్తుండగా మీడియా సమక్షంలో లైవ్ ఏర్పాటు చేసి మాట్లాడుదాం. ఇద్దరి కేసులపై లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. ఈ విచారణలతో ప్రజాధనం దుర్వినియోగం కాదు. నీ ప్యాలెస్ అయినా.. ఈడీ ఆఫీసులో అయినా నేను చర్చకు సిద్దం.. నువ్వు సిద్దమా..?” అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
“ఈ విచారణకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని వార్తల్లో చూశా. నీ మీద ఏసీబీ, ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద కూడా ఏసీబీ, ఈడీ కేసు బనాయించావు అయినా నేను భయపడను. నువ్వు అంటే అడ్డంగా దొరికావు. నేను నిజాయితీపరుణ్ణి, ధైర్యవంతుణ్ణి కాబట్టి ఎదుర్కుంటా. కానీ రూ.10 కోట్లు ప్రజాధనం వృథా చేయకు. ఈ వృధా అవుతున్న రూ.10 కోట్ల ప్రజా ధనంతో ఇంకా 500 మందికి రుణమాఫీ చేయవచ్చు. కొంత మందికైనా పెన్షన్లు ఇవ్వొచ్చు. అందుకే డబ్బులు వృథా కాకుండా లై డిటెక్టర్ పరీక్ష పెట్టు” అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
“తేదీ, సమయం రేవంత్ రెడ్డే నిర్ణయించాలి. ఇలా అయితే ఓ యాభై లక్షల్లో మొత్తం నిజం తెలుస్తుంది. అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుంది. హైకోర్టు. సుప్రీంకోర్టు. భారత న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కాకుండా ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది. నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు” అని కేటీఆర్ చెప్పారు.
“పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగాను ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. అన్నింటికి సమాధానాలు ఇచ్చాను”అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం