Formula E Car Race: నేడు ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసుల్లో ఏసీబీ ముందుకు కేటీఆర్‌, దర్యాప్తులో ఈడీ, ఏసీబీ దూకుడు-ktr appears before acb in formula e car race cases today aggressive in investigation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Car Race: నేడు ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసుల్లో ఏసీబీ ముందుకు కేటీఆర్‌, దర్యాప్తులో ఈడీ, ఏసీబీ దూకుడు

Formula E Car Race: నేడు ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసుల్లో ఏసీబీ ముందుకు కేటీఆర్‌, దర్యాప్తులో ఈడీ, ఏసీబీ దూకుడు

Formula E Car Race: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ నేడు ఫార్ములా ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. అక్రమ నగదు చెల్లింపులపై ఇప్పటికే ఏసీబీ అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసుల విచారణలో భాగంగా నేడు ఏసీబీ ముందు హాజరు కానున్నారు.

నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్‌

Formula E Car Race: హైదరాబాద్‌ ఫార్ములా ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో నమోదైన కేసుల దర్యాప్తులో తెలంగాణ ఏసీబీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వేగం పెంచాయి. కేటీఆర్‌ కేంద్రంగా నమోదైన కేసుల్లో  ఏసీబీ, ఈడీలు వేర్వేరుగా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.ఇందులో భాగంగా నేడు కేటీఆర్‌ ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

  ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహణ కోసం జరిపిన చెల్లింపుల్లో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా అభియోగాలు నమోదయ్యాయి. డిసెంబర్ 19న కేటీఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. డిసెంబర్ 20వ తేదీన ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ నమోదు చేసింది.

ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత జనవరి 7న విచారణకు రావాలని డిసెంబర్‌ 28న నోటీసులు జారీ చేసింది. మరోవైపు 6వ తేదీన విచారణకు రావాలని జనవరి 3న తెలంగాణ ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్‌ హాజరవుతారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కేసులో హెచ్‌ఎండిఏ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారిఅర్వింద్‌ కుమార్‌ జనవరి 8న, హెచ్‌ఎండిఏ రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్ రెడ్డి జనవరి 10న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈడీ కేసుల్లో బీఎల్‌ఎన్‌ రెడ్డి జనవరి 8న, అర్వింద్ కుమార్ జనవరి 9న విచారించనున్నారు.

అక్రమ చెల్లింపులపై ఈడీ కేసు నమోదు...

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో జరిగిన ఫార్ములా ఈ కార్‌ రేస్ నిర్వహణలో భాగంగా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ సంస్థకు రూ.45.71 కోట్లను తెలంగాణ మునిసిపల్ శాఖ ద్వారా హెచ్‌ఎండిఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని హెచ్‌ఎండిఏ ముఖ‌్య కార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఆర్థిక శాఖ అమోదం లేకుండా, హెచ్‌ఎండిఏ ఛైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆర్‌బిఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయడంపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

లండన్‌లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ ఖాతాకు బ్రిటన్ కరెన్సీలో నగదు బదిలీ చేశారని, ఇందులో ఆదాయ పన్నుమినహాయించకపోవడం వల్ల ఐటీ శాఖకు రూ.8.06కోట్లను చెల్లించాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీని కోరారు. ఈ వ్యవహారంలోనే కేటీఆర్‌, అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. విదేశాలకు నగదు చెల్లింపుల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ లబ్ది ఎవరిిక చేకూరిందో తేలాల్సి ఉంది.