జూబ్లీహిల్స్‌ ఓటర్లు పంచ్‌ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తగలాలి : కేటీఆర్-ktr and harish rao comments on congress party over jubilee hills election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జూబ్లీహిల్స్‌ ఓటర్లు పంచ్‌ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తగలాలి : కేటీఆర్

జూబ్లీహిల్స్‌ ఓటర్లు పంచ్‌ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తగలాలి : కేటీఆర్

Anand Sai HT Telugu

జూబ్లీహిల్స్‌లో ఓటర్లు పంచ్‌ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తగలాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అనే విషయాన్ని ఓటర్లు తేల్చుకోవాలన్నారు.

కేటీఆర్

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధి రహమత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, హరీశ్ రావుతోపాటుగా బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. పేగులు మెడలో వేసుకుంటానని ఎప్పుడూ అంటుంటారని, ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని ఆయనను పక్కనపెట్టారన్నారు. జుబ్లీహిల్స్ ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్‌కు తగలాలి అని పిలుపునిచ్చారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అనేది ఓటర్లు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని తెలిపారు. అలాంటివి ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామన్నారు.

'ఒక్కొక్కరికి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో గుర్తించాలి. ప్రతి వ్యక్తిని కలిసి బాకీ కార్డు ఇవ్వాలి. కాంగ్రెస్‌ను హైదారాబాదీలు నమ్మలేదు. ఎన్నికల్లో అందుకే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇండ్లను కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? రేవంత్ రెడ్డి మాదిరి గలీజ్ భాష మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో‌లే లేరు.' అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణకు అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చేశారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఎలాంటి పని జరగాలి అనుకున్నా.. కాంగ్రెస్ నేతలు కమీషన్లు అడుగుతున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయన్నారు. తన హయాంలో పేదల కోసం బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. మందులు కూడా ఉండటం లేదని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లే కూలుస్తున్నారన్నారు. పెద్దలవి కూల్చడం లేదని చెప్పారు.

మాగంటి సునీత భావోద్వేగం

ఈ సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ను తలుచుకుని కన్నీంటి పర్యంతమయ్యారు. గోపినాథ్ ఆశాయలను ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. తన తండ్రి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని గోపీనాథ్ కుమార్తె అక్షర అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.