KTR : ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం అయిపోయింది.. కాంగ్రెస్‌పై కేటీఆర్ మాస్ సెటైర్లు-ktr alleges that telangana has become an atm for the congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం అయిపోయింది.. కాంగ్రెస్‌పై కేటీఆర్ మాస్ సెటైర్లు

KTR : ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం అయిపోయింది.. కాంగ్రెస్‌పై కేటీఆర్ మాస్ సెటైర్లు

Basani Shiva Kumar HT Telugu
Jan 04, 2025 05:47 PM IST

KTR : కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో సీఎం అంటే ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు.

కేటీఆర్
కేటీఆర్

ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది.. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకండి.. కేసులైనా భయపడకండి.. ఎవరూ ఏం చేయలేరు.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బాక్సింగ్‌లో కిందపడ్డా.. నిలబడి కొట్లాడేటోడే వీరుడని స్పష్టం చేశారు. చిల్లర మల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

yearly horoscope entry point

అనుమానం అదే..

'మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. కాంగ్రెస్ నుంచి 8, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వచ్చింది మాత్రం గుండు సున్నా. కేసీఆర్ దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది. కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు రూ.5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పాం' అని కేటీఆర్ వివరించారు.

మిగులుతో ఇస్తే..

'రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో రూ. 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో రూ. 1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా? ఈ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది?' అని కేటీఆర్ ప్రశ్నించారు.

పైసలన్నీ ఢిల్లీకే..

'పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం అయిపోయింది. కొడంగల్‌లో భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్లు కేసుల గురించి ఆలోచిస్తుంటే.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించి, బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

గ్రామాల్లో చర్చ పెట్టాలి..

'రైతు భరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు? మళ్లీ ఈ రైతు ప్రమాణ పత్రాలెందుకు? ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలి. వచ్చే ఆదాయం అంతా రైతులకే ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు కాంగ్రెస్ మోసాలను వివరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

రైతులను దొంగలుగా చూస్తున్నారు..

'కేసీఆర్ రైతులను రాజులుగా చూస్తే.. రేవంత్ దొంగలుగా చూస్తున్నారు. నాడు కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కొతలు పెట్టి నీచానికి దిగజారుతున్నారు. రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టేందుకే డిక్లరేషన్ల పేరిట షరతులు పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి అంటే అది కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యమే. భూకంపం వచ్చినా తట్టుకొని నిలబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు' అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Whats_app_banner