నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన…. తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమని ఆరోపించారు.
కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పించేందుకు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం పోయినా ప్రజల్లో మాత్రం టన్నుల కొద్ది అభిమానం అలాగే ఉందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యంగా గులాబీ జెండానే ఉంటుందని చెప్పారు.
“ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్‌కు పోరాటనామ సంవత్సరమే. అందుకు ఏప్రిల్ 27న తొలి అడుగుపడబోతుంది. దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మదరాసీలు అని పిలిచేవారు.. దాన్ని మార్చిన నాయకుడు ఎన్టీఆర్. ఒక పార్టీ పెట్టి భారతదేశంలో తెలుగువాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు. ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందని… తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి. కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్ళు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. తమ స్థాయి మరచి గ్రామ సింహాలు కూడా కేసీఆర్ మీద మాట్లాడుతున్నాయి” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“2001లో ఒక్కడిగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్. ఇదే చరిత్ర. కేసీఆర్ లేకపోతే గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల పోరాటాలకు కేసీఆర్ నాయకత్వం తోడై విజయం సాధించాం. అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయవచ్చో పదేండ్ల పాటుు చూపిస్తూ దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిన నాయకత్వం కేసీఆర్‌ది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్. ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. మాకు ఉద్యమం కొత్త కాదు.. అధికారం కొత్త కాదు.. ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం మాకోసం కాదు ప్రజల కోసం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒక వికృతమైన మనస్తత్వం. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఢిల్లీకి మూటలు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్‌కు ఏం లేదు. అసూయ, ద్వేషం, ఆశ ఈ మూడు అంశాలే బీఆర్ఎస్ ఓటమికి కారణం. యూట్యూబ్‌ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి… ఇవాళ అదే యూట్యూబ్ జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతా అంటున్నాడు. వందశాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవులను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్‌ని కాంగ్రెస్ నాయకులు ఎవరు స్వీకరించలేదు. రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ఖాతాల్లో టింగు టింగుమని పడుతున్నాయి” అని కేటీఆర్ ఆరోపించారు.
“కృష్ణానదిలో 36 శాతం నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది. కానీ ఈ కాంగ్రెస్ సన్నాసుల ప్రభుత్వం 24 శాతం నీళ్లను కూడా వాడుకోలేదు. నీళ్లు వాడుకునే తెలివి లేదు. నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు. చెరువులను నింపే తెలివి లేదు. భూగర్భ జలాలను పెంచే తెలివి లేదు. కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదు. బడే భాయ్ మోడీ, ఛోటే బాయ్ రేవంత్ మధ్య ఆ అవగాహన ఉంది. తెలంగాణకు గొంతుగా బీఆర్ఎస్ ఉండొద్దని కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి లక్ష్యం. కేసీఆర్ తెలంగాణ పక్షం.. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పక్షం. రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు ” అని కేటీఆర్ చెప్పారు.
వరంగల్ సభకు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలన్నారు. “జగదీష్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవు. స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్‌కు ఎంతో గౌరవం. ప్రసాద్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉంది. శాసనసభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోలేదు. మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందన్నారు. “కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందాం. గ్రామస్థాయి వార్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందాం. కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తాం. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడు లాగా విజృంభించాలి. ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగుపడాలి. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరం” అని కేటీఆర్ కామెంట్స్ చేశారు.