Khammam ACB Trap: ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం మెడికల్ కాలేజీ ఏఓ, జూనియర్ అసిస్టెంట్
Khammam ACB Trap: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ కొత్తగూడెం మెడికల్ కాలేజీ ఏవో ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ఏసీబీకి చిక్కారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల బిల్లులు చేసేందుకు రూ.15లక్షలు డిమాండ్ చేసి రూ.7లక్షలకు బేరం కుదుర్చుకున్న నిందితులను ఏసీబీ వలపన్ని పట్టుకుంది.
Khammam ACB Trap: కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ దాడుల పరంపర కొనసాగుతుంది. నెల నెలా ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు జీతాలు చాలక లంచాలకు అలవాటు పడుతున్నారు. దీంతో ఏసీబీ అధికారులు కాస్త దూకుడు పెంచారు. అయినా అవినీతి అధికారులు ఆగడం లేదు. అవినీతి సొమ్ము మరిగిన అధికారులు ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగూడెం మెడికల్ కళాశాలలో 49 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల 6 నెలల జీతాల బిల్లు చేసేందుకు మెడికల్ కళాశాల ఏవో ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ఏజెన్సీని రూ. 15 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
అంత ఇవ్వలేమని చివరికి రూ.7 లక్షలకి బేరం కుదుర్చుకున్నారు. ఈక్రమంలో బుధవారం మెడికల్ కళాశాలలో ఏజెన్సీ నిర్వాహకుల నుంచి ఖలీలుల్లా, సుధాకర్ లు మూడు లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి డీఎస్పీ వై రమేష్ సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉద్యోగుల జీతాల కోసం గతంలో ఏజెన్సీ వాళ్ళు ఉన్నతాధికారులను కలిస్తే రెండున్నర నెలల జీతాలే బిల్లు చేశారని సమాచారం.
49 మంది ఉద్యోగుల్లో 23 మందికి అర్హత లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ఏజెన్సీతో బేరం కుదుర్చుకుని 49 మందికి మిగిలిన మూడున్నర నెలల జీతం చెల్లించేందుకు ఏవో, జూనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్ చేశారు. అసలు 23 మందికి అర్హత లేనప్పుడు ఎలా జాయిన్ చేసుకున్నారు.? మరి వారికి జీతాలు ఎలా చెల్లిస్తున్నారునేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
లంచం అడిగితే కాల్ చేయండి..
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వైరమేష్ మాట్లాడుతూ ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని స్పష్టం చేశారు. అలా ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఏసీబీని ఆశ్రయించినంత మాత్రాన పని జరగదని అనుకోవద్దని సక్రమమైతే ఆ పని ఎసిబినే చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎల్లవేళలా ఏసీబీ యాక్టివ్ గా పని చేస్తుందని వివరించారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.)