Fake Police : పోలీసులమని బిల్డప్ ఇచ్చి, రీల్స్ చేస్తున్న విద్యార్థులపై దాడి- చివరికి కటకటాల పాలు-kothagudem police arrested four people duped as police beating students making reels on road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fake Police : పోలీసులమని బిల్డప్ ఇచ్చి, రీల్స్ చేస్తున్న విద్యార్థులపై దాడి- చివరికి కటకటాల పాలు

Fake Police : పోలీసులమని బిల్డప్ ఇచ్చి, రీల్స్ చేస్తున్న విద్యార్థులపై దాడి- చివరికి కటకటాల పాలు

HT Telugu Desk HT Telugu
Aug 07, 2024 09:16 PM IST

Fake Police : రీల్స్ చేస్తున్న విద్యార్థులను పోలీసుల పేరిట బెదిరించి, వారిపై దాడి చేశారు నలుగురు వ్యక్తులు. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. నలుగురు నిందితులను కొత్తగుడెం పోలీసులు అరెస్టు చేశారు.

రీల్స్ చేస్తున్న విద్యార్థులను పోలీసులమని బెదిరించి దాడి
రీల్స్ చేస్తున్న విద్యార్థులను పోలీసులమని బెదిరించి దాడి

Fake Police : సరదాగా బయటికి వెళ్లి సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్న విద్యార్థులను పోలీసుల పేరుతో బెదిరించి వారిపై దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకుంది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం కొత్తగూడేనికి చెందిన విద్యార్థులు ఆకాష్, తరుణ్, జస్వంత్ రాజులు రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ జంక్షన్ వద్ద నేషనల్ హైవే మెయిన్ రోడ్డు దగ్గర రీల్స్ తీసుకునేందుకు వెళ్లారు. వాళ్లు సరదాగా ఫోన్ లో వీడియోలు తీసుకుంటున్న క్రమంలో గమనించిన నలుగురు దుండగులు వీరిపై పోలీసుల పేరుతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పెనగడపకు చెందిన ఆ నలుగురు వ్యక్తులు కారులో వస్తూ పోలీసులమని బిల్డప్ ఇస్తూ విద్యార్థులను సమీపించారు.

"మీరు ఇక్కడ ఎందుకు ఫోటోలు దిగుతున్నారు.. మీరు గంజాయి బ్యాచ్ అని మాకు అనుమానంగా ఉంది.." అంటూ వారి ఫొటోలు తీసి హల్ చల్ చేశారు. పోలీసులమని బెదిరిస్తూ డబ్బుల కోసం డిమాండ్ చేశారు. గట్టిగా బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేశారు. మేం తీసిన ఫొటోలు డిలీట్ చేయాలంటే డబ్బులు ఇస్తేనే డిలీట్ చేస్తామని బెదిరించారు. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థులు "మీ ఐడీ కార్డులు చూపించండి.." అని అడగడంతో ఆ నలుగురు వ్యక్తులు ఆగ్రహించారు. మమ్మల్నే ఐడీ కార్డ్స్ అడుగుతారా? అంటూ వారిపై దాడికి దిగారు. వారు దాడి చేస్తుండగానే ఈ ముగ్గురు విద్యార్థులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

ఫిర్యాదుతో బండారం బట్టబయలు

ఆ నలుగురు వ్యక్తుల నుంచి తప్పించుకుని బయటపడిన ఆ విద్యార్థులు జరిగిన ఉదంతంపై కొత్తగూడెం 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పెనగడప ప్రాంతానికి చెందిన ఎస్కే యాకూబ్ గౌరీ, ఎగ్గడి అశోక్, వడ్డే మనోజ్, పులిచర్ల శరత్ చంద్రలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కారు, ఫొటోలు తీసిన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లొద్దు

విద్యార్థులు, మరెవరైనా రీల్స్ తీసుకోవాలన్న పేరుతో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దని కొత్తగూడెం రెండో పట్టణ సీఐ రమేష్ సూచించారు. విద్యార్థులు, ఇతర వ్యక్తులు ఈ విధంగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళి ఫోటో షూట్స్, రీల్స్ లాంటివి తీసుకోవడం చేయకూడదని, ఇలాంటి సందర్భాలు ఊహించని ప్రమాదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. రోడ్లపై ఏమరపాటుగా రీల్స్ తీయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే రైల్వే ట్రాక్ లపై రీల్స్ చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నిర్మాణంలో ఉన్న ప్రదేశాలకు, ప్రమాదకరమైన వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లి ఫోటోలు దిగడం రీల్స్ చేయడం వంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి

 

సంబంధిత కథనం