Kondaparthy Village : మారుతున్న ‘కొండపర్తి’ రూపురేఖలు, గవర్నర్ దత్తతతో గిరిజన గ్రామానికి మహర్దశ-kondaparthy village is changing a great milestone for the tribal village with the governor adoption ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kondaparthy Village : మారుతున్న ‘కొండపర్తి’ రూపురేఖలు, గవర్నర్ దత్తతతో గిరిజన గ్రామానికి మహర్దశ

Kondaparthy Village : మారుతున్న ‘కొండపర్తి’ రూపురేఖలు, గవర్నర్ దత్తతతో గిరిజన గ్రామానికి మహర్దశ

HT Telugu Desk HT Telugu

Kondaparthy Village : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చొరవతో ములుగు జిల్లా కొండపర్తి ఆదివాసీ గ్రామం రూపురేఖలు మారిపోతున్నాయి. గవర్నర్ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ గ్రామానికి మహర్దశ పట్టుకుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం గ్రామంలో పర్యటించి, పనులు పూర్తైన భవనాలను ప్రారంభించారు.

మారుతున్న ‘కొండపర్తి’ రూపురేఖలు, గవర్నర్ దత్తతతో గిరిజన గ్రామానికి మహర్దశ

Kondaparthy Village : కొండపర్తి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివాసీ కుగ్రామం. బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేని చిన్నపాటి పల్లె. అంతగా అభివృద్ధి కూడా ఎరుగని ఆ ఊరు గతేడాది ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయింది. గ్రామంలోని ఇళ్లు ధ్వంసం కాగా.. అక్కడి జనాలు కూడా కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అక్కడి ప్రజల దీనావస్థను తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చలించిపోయారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అప్పటి నుంచి ఆ గ్రామానికి మహర్దశ పట్టుకుంది. గవర్నర్ దత్తత తీసుకోవడం, మంత్రి సీతక్క చొరవ కలిసి రావడంతో ఆ ఊరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. గ్రామాన్ని సంపూర్ణ అభివృద్ధి వైపు అడుగులు వేయించాలన్న గవర్నర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ ప్రారంభించారు. ఈ మేరకు నిరుడు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా.. అందులో పూర్తయిన కొన్ని పనులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం తన చేతుల మీదుగా ప్రారంభించారు.

ఇన్నాళ్లు అష్టకష్టాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి అనే కుగ్రామంలో కనీస సౌకర్యాలు లేక అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో మొత్తంగా 68 కుటుంబాలు ఉండగా.. 324 మంది జనాభా ఉన్నారు. కాగా జాతీయ రహదారికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ కొండపర్తి గ్రామానికి సరైన రవాణా మార్గం లేదు. దాదాపు ఐదేళ్ల కిందట గిరిజన సంక్షేమశాఖ రూ.కోటి అంచనా వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు ఆగిపోయారు.

దీంతో గ్రామానికి రోడ్డు సౌకర్యం కరువైంది. అంతేగాకుండా గ్రామంలో మురుగుకాల్వలు కూడా లేక జనాలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దశాబ్దాల కిందట నిర్మించిన భవనంలోనే అక్కడ స్కూల్ నడిపిస్తుండగా.. అది కూడా శిథిలావస్థకు చేరింది. దీంతో ఇక్కడి ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.

గవర్నర్ దత్తతతో మహర్దశ

2024 ఆగస్టు 31న కురిసిన భారీ వర్షాలు, టోర్నడో కారణంగా కొండపర్తి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎకరాల మేర చెట్లన్నీ నేలకూలాయి. అదే సమయంలో కొండపర్తి గ్రామంలో 18 ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒకేచోట పెద్ద ఎత్తున చెట్లు నేలకూలడం, అది కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో స్థానిక మంత్రి సీతక్క, జిల్లా అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ సమయంలోనే కొండపర్తి గ్రామాన్ని సందర్శించి, అక్కడి ఇబ్బందులను గుర్తించారు.

కాగా కొండపర్తి దీనావస్థ తెలుసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అదే విషయాన్ని ప్రకటించి, గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు గ్రామాన్ని సందర్శించి, అక్కడున్న సమస్యలన్నింటినీ గుర్తించారు. ఆ తరువాత గవర్నర్ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించారు.

గ్రామస్థులందరికీ ఇళ్లు

కొండపర్తిని అభివృద్ధి బాట పట్టించడంలో భాగంగా మొదట గ్రామస్తులందరికీ పక్కా ఇళ్లు కట్టించే పనికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో రెండే పక్కా ఇళ్లు ఉండగా.. మిగతా వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. రూ.68 లక్షలు వెచ్చి రెడ్కో ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి సొలార్ విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.

గ్రామంలో అన్ని వీధులకు సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.70 లక్షలతో రెండు కమ్యూనిటీ భవన నిర్మాణాలు ప్రారంభించారు. గ్రామంలోని పురుషులు, మహిళలను ఐదు టీమ్లుగా విభజించి, విస్తరాకుల తయారీ, కుట్లు, అల్లికలు, శానిటరీ వస్తువులు, మసాలల తయారీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన గవర్నర్

దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్థానిక మంత్రి సీతక్కతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.35 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ బిల్డింగ్ ను ప్రారంభించారు. అందులోనే మహిళలు, యువతకు వృత్తి, నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.

రూ.10 లక్షలు వెచ్చించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు రిపేర్లు చేసి ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు. రూ. 6.50 లక్షలతో ఏర్పాటు చేసిన కుమ్రం భీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. 300 ఎకరాల భూమికి సాగు నీరు అందేలా ఇందిరా జలప్రభ పథకం కింద వేసిన బోర్లను గవర్నర్, మంత్రి సీతక్క కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం