Kondagattu : కొండగట్టు ఆలయ ఈవో సస్పెన్షన్
Kondagattu Temple News : కొండగట్టు ఆలయ ఉద్యోగుల చేతివాటం వ్యవహారంపై దేవాదాయశాఖ దృష్టిపెట్టింది. బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ ఈవోపై సస్పెన్షన్ విధించింది.

Kondagattu Temple EO Suspension: కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు(Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగుల చేతివాటం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ, ఆలయ ఆదాయాన్ని కొల్లగొట్టిన ఘటనలపై ఆలస్యంగా అధికారులు మెల్కొన్నారు. ఆలయ ఈవో వెంకటేశ్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారి టెండరు వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులు ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు మల్యాల ఠాణాలో ఈవో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్యానికి మూల్యం సస్పెన్షన్….
కొండగట్టు అంజన్న(Kondagattu) ఆలయంలో పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం అయినప్పటికీ ఈవో వెంకటేష్ 8 నెలల వరకు గుర్తించకపోవడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ విషయమై ఆడిట్ నిర్వహించగా దాదాపు రూ.52.39 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలడంతో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయశాఖ కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. ఈ విషయమై ఈనెల 19న దేవాదాయశాఖ ఏడీసీ జ్యోతి ఈవో కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించి రికార్డులను వెంటతీసుకెళ్ళారు. ఈవో నిర్లక్యం కారణమని పేర్కొంటూ సస్పెండ్ చేస్తున్నట్లు, తమ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లవద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కరీంనగర్ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కు కొండగట్టు ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముగ్గురు ఉద్యోగులకు మెమోలు జారీ…
కొండగట్టు ఆలయంలో ముగ్గురు ఉద్యోగులకు ఈవో వెంకటేశ్ గతంలో మెమోలు జారీ చేశారు. ఆలయ షాప్ ల టెండర్ లకు సంబంధించి వ్యాపారుల నుంచి రూ.37.90 లక్షలను వసూలు చేసి సొంతానికి వాడుకున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారిని ఈవో సస్పెండ్ చేయడంతో పాటు మల్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తాజాగా శ్రీనివాసచారి ఆలయ నిధులు రూ.14.49 లక్షల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తేలడంతో రెండోసారి మెమో జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా ఏఈవోగా ఇటీవలే కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయానికి బదిలీ అయిన బుద్ది శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ సునీల్ మెమోలు జారీ చేసినట్లు ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.