Komuravelly SI Nagaraju Suspension: అగ్నిసాక్షి గా పెళ్లి చేసుకున్న తన భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం చేస్తున్న కొమరవెల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు మల్టీ జోన్-1 ఐజీ ఎస్వీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భార్య నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.... నాగరాజు ఎస్సై ఉద్యోగం రాకముందే 10 ఏళ్ల కిందట మానసను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా నాగరాజు భార్యతో సరిగా ఉండటం లేదు. మరో మహిళాతో తన భర్త సహజీవనం సాగిస్తున్నట్లు మానస గుర్తించింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.
గతంలోనే నాగరాజు తీరుపై చేర్యాల ఇన్ స్పెక్టర్, సిద్ధిపేట కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని భార్య మానస ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తన ఇద్దరు కుమారులను కూడా తీసుకెళ్లాడని చెప్పారు.
మంగళవారం(మే 21) తన బంధువులతో కలిసి కొమురవెళ్లి స్టేషన్ కు వెళ్లింది. అతనితో మాట్లాడేందుకు వీరంతా వెళ్లగా... నాగరాజు అందుబాటులో లేడు. ఆరు రోజులపాటు లీవ్ పెట్టి వెళ్లాడని అక్కడి సిబ్బంది చెప్పారు.
నాగరాజు తీరుతో విసుగు చెందిన భర్త మానస... పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని నిరసనకు దిగింది. విషయం తెలిసిన పైఅధికారులు... మానసతో మాట్లాడారు. విచారణ జరిపి నాగరాజుపై చర్యలు తీసుకుంటామని హామీనివ్వటంతో మానస వెనక్కి తగ్గి నిరసన విరమించింది.
సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాలతో నాగరాజుపై విచారణ చేపట్టారు. భర్త మానస ఇచ్చిన ఫిర్యాదులోని విషయాలు వాస్తవమే అని తేల్చారు. విచారణ తర్వాత ఐజీ రంగనాథ్ కు నివేదిక సమర్పించారు. స్పందించిన ఐజీ రంగనాథ్.... ఎస్సై నాగరాజును విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేశారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లలను మానసకు అప్పగించే ప్రయత్నాలు కూడా అధికారులు చేస్తున్నారు.
భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే…. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పి. శ్రీనివాస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు ఫిర్యాదు రాగా విచారణ చేపట్టారు. విచారణలో వాస్తవాలు బయటికి రావటంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ ను విధుల నుంచి తప్పించారు.