Komatireddy Rajgopal Reddy : తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని చెప్పారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. చౌటుప్పల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "జానారెడ్డి ధర్మరాజు అనుకుంటే ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు" అని కోమటిరెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జానారెడ్డి, మరికొంతమంది కలిసి తనకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదని, కెపాసిటీని బట్టి వస్తుందన్నారు.
"మంత్రి పదవి అనేది ఒక అలంకారం కాదు బాధ్యత. అది గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. తెలంగాణను గత పదేళ్లు పాలించింది కుటుంబ పార్టీ. వారికి వంగి వంగి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు దక్కాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాదు, ఒక బాధ్యతగా భావిస్తాను. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? అంటూ ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. దేశం తరఫున క్రికెట్ లో అన్నదమ్ములు యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్ ప్రాతినిధ్యం వహిస్తే లేనిది మంత్రి పదవులు ఇద్దరికి ఇస్తే తప్పేంటి. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటిని బట్టి వస్తుంది"- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ లాంటి జిల్లాల్లో మంత్రులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినా ఎంపీలు గెలవలేదన్నారు. భువనగిరిలో ఒక ఎమ్మెల్యేగా తాను ఎంపీని గెలిపించానన్నారు. తన మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు, జానారెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే స్థితిలో ఉండడన్నారు.
సంబంధిత కథనం