Komatireddy Rajagopal : మంత్రి జగదీష్ అవినీతి చిట్టా తీస్తా.. తప్పైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా
ఇంకా ఉప ఎన్నిక షెడ్యూల్ రానేలేదు. మునుగోడులో మాత్రం నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరిగిపోతోంది. పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ చేశాయి. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి మీద కామెంట్స్ చేశారు.

మునుగోడు నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ వేడి పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నేతల మధ్య మెుదలైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే గెలుపుపై పార్టీలు కామెంట్స్ చేస్తున్నాయి. ఇక నేతలు.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి అవినీతి, అక్రమ ఆస్తులను బయటపెడతానని కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే నిరూపించాలన్నారు. జగదీష్ రెడ్డి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరానని.. ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తన అక్రమాలను నిరూపించాలని సవాల్ విసిరారు. మంత్రి అవినీతి చిట్టా బయటపెడతానని ప్రకటించారు.
'తెలంగాణ రాక ముందు ఇల్లే లేని జగదీష్ రెడ్డికి.. ఇప్పుడు వేయి కోట్ల ఆస్తి ఎక్కడిది? అవినీతి, అక్రమాలు, బినామీ ఆస్తులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తా. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నిరూపిస్తే.. మంత్రి రాజీనామా చేస్తారా?. నేను రాజీనామా చేసిన తర్వాతే.. చౌటుప్పల్-సంస్థాన్ నారాయణపురం రహదారిని ఆగమేఘాల మీద వేస్తున్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోనే రాష్ట్ర ప్రజల తలరాతలు మారుతాయి.' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తులు ఎంతున్నాయని త్వరలోనే చెబుతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నేర చరిత్రపై ఒక పేపర్ రిలీజ్ చేస్తానని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా తప్పుడు మార్గంలో తాను కాంట్రాక్టులు పొందినట్లు నిరూపిస్తే.. రాబోయే మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. లేదంటే మీ బినామీ ఆస్తుల చిట్టా తీస్తా అని వ్యాఖ్యానించారు. జగదీష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.