Rajagopal Reddy : పార్టీ మారటం లేదు... బీజేపీ సైనికుడిగా ముందుకు కదులుతా - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి-komatireddy rajagopal reddy clarity about party changing rumors ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Komatireddy Rajagopal Reddy Clarity About Party Changing Rumors

Rajagopal Reddy : పార్టీ మారటం లేదు... బీజేపీ సైనికుడిగా ముందుకు కదులుతా - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

HT Telugu Desk HT Telugu
Oct 05, 2023 09:52 PM IST

Komatireddy Rajagopal Reddy News: పార్టీ మార్పు అంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. మునుగోడులో గెలుస్తామని.. కాషాయ జెండా ఎగరేస్తామన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)

Komatireddy Rajagopal Reddy : ఎట్టకేలకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను పార్టీ మారడం లేదని, బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా బీజేపీతో అంటీ ముట్టనట్టు ఉంటున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు అయినా.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలకు గైర్హాజర్ అయ్యారు. దీంతో ఆయన రేపో మాపో కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. మీడియాలో, సోషల్ మీడియాలో జరగుతున్న పార్టీ మార్పిడి ప్రచార వార్తలను రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ‘‘ నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళుతున్నానంటూ కొన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను...’’ అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మునుగోడు ఉపఎన్నికలో ఓటమి...

కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నుంచే మునుగోడు ఉప ఎన్నికల్లో పోట చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పడుతుందని, అంతకు ముందు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీ ఎదుగుదలకు దోహదపడినట్టే.. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం రాష్ట్రంలో తమ స్థితిని మరింత బలోపేతం చేస్తుందని బీజేపీ నాయకత్వం భావించింది. అయితే, ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చేసిన ప్రయత్నాలను అధికార బీఆర్ఎస్ ఆధారాలు సహా బట్టబయలు చేయడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో మునుగోడు ఉప ఎన్నికను సవాలుగా తీసుకుని పనిచేయలేక పోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యాలయానికి, కార్యకలాపాలకు దాదాపు దూరంగా ఉన్నారు. ఈ సమయంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జాతీయ కమిటీలో స్థానం లభించింది. అయినా, రాజగోపాల్ రెడ్డి బీజేపీ కారక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు.

కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని ప్రచారం

ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ నాయకులతో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం గుప్పుమంది. ఈ వార్తలను ఆయన ఇప్పటి దాకా ఖండించలేదు. ఇటీవల బీజేపీ నాయకురాలు విజయశాంతి ఇంటిలో జరిగిన ముఖ్య నేతల భేటీ తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మక మౌనమే పాటించారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి తాము పార్టీ మారడం లేదని పదే పదే ప్రకటించినా.. రాజగోపాల్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి సేట్ మెంట్ రాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమన్న ప్రచారమే ఎక్కువగా జరిగింది. రెండు రోజుల కిందట మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పు పై త్వరలోనే స్పష్టత ఇస్తానని ప్రకటించారు. కాగా, గురువారం 5వ తేదీ) మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో సమావేశం అయిన రాజగోపాల్ రెడ్డి అనంతం తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను పార్టీ మారడం లేదంటూ ప్రకటన విడుదల చేశారు.

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతా

‘‘ నా చుట్టూ ఉన్న సమజానికి నా వంతు మంచి చేయాలన్న లక్ష్యంతో రాజకీయ మార్గాన్న ఎంచుకున్న వ్యక్తిని. ఆ దిశనగానే ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్ధం లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను. తెలంగాణలో తర్వాత రాజకీయ పరిణామాలు నన్ను ఎంతో కలిచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్తితి తయారైంది. కేసీఆర్ ప్రజా పాలకుని వలే కాకుండా తెలంగాణకు నిజాం రాజువలే పోకడలు పోతున్నారు. తెలంగాణలో ప్రజా రాజ్యం ఏర్పాటు దిశగానే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలుకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను భాగస్వామి కావాలని అడుగు వేశాను. మునుగోడులో కేసీఆర్, అయన ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం పెట్టినా.. నా మీద, బీజేపీ మీద మునుగోడు ప్రజలు అచంచల విశ్వాసాన్నే చూపారు. కేసీఆర్ అవినీతిని కక్కించి, కుటుంబ తెలంగాణ బదులు ప్రజాస్వామిక, బహుజన తెలంగాణ ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. నేనే కాదు ముఖ్య నాయకులెవరూ బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతున్నాము...’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సుదీర్ఘ ప్రకటనలో వివరించారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ )

IPL_Entry_Point