Kodad Politics : కోదాడ బీఆర్ఎస్ లో ముదిరిన వివాదం, స్వతంత్ర అభ్యర్థిగా శశిధర్ రెడ్డి పోటీ!
Kodad Politics : కోదాడ బీఆర్ఎస్ లో అసమ్మతి మరింత ముదిరింది. బొల్లం మల్లయ్య యాదవ్ ను మార్చాల్సిందేనని అసమ్మతి నేతలు పట్టుపడుతున్నారు. అభ్యర్థిని మార్చకపోతే శశిధర్ రెడ్డిని ఇండిపెండెంటుగా బరిలో దింపేందుకు రెడీ అవుతున్నారు.
Kodad Politics : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ రాజకీయాలు రక్తి కడుతున్నాయి. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం ఇచ్చారు. కానీ దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిందేని అసమ్మతి మొదలైంది. ప్రధానంగా తెలంగాణకు చివరలో, ఏపీకి సరిహద్దులో ఉన్న కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయం ముదిరి పాకాన పడుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశం
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ప్రకటించడానికి ఆరు నెలల ముందు నుంచే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దన్న డిమాండ్ తో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు నాయకత్వంలో పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి, ఎర్నేని బాబు, మహ్మద్ జానీ, పాండురంగారావు తదితర నాయకులు జట్టుకట్టి ప్రయత్నిస్తున్నారు. కానీ, వీరి అసమ్మతిని ఏ మాత్రం పట్టించుకోని పార్టీ హై కమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కే టికెట్ కట్టబెట్టింది. ఇక, అప్పటి నుంచి ఈ అసమ్మతి నాయకులు మరింతగా తమ వాదనలు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను దగ్గరకు తీసి బుజ్జగిస్తున్న నాయకత్వం కోదాడ విషయంలో ఇంకా చొరవ చూపడం లేదు. దీంతో తమ తమ మద్దతు దారులతో అసమ్మతి నాయకులు తాజాగా మరో మారు సమావేశమై కోదాడ టికెట్ తమలో ఒకరికి ఇవ్వాల్సిందేనని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ రద్దు చేయాల్సిందేని పట్టుబడుతున్నారు.
ఇండిపెండెంటుగా తమలో ఒకరిని బరిలోకి దింపే యోచన
పార్టీ హై కమాండ్ తమ డిమాండ్ ను పెడచెవిన పెట్టి టికెట్ మార్చకుంటే తమలో ఒకరైన శశిధర్ రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. ‘‘పదిహేనేళ్లుగా ఎదురు చూస్తున్నా.. పార్టీ నాకు న్యాయం చేసింది లేదు. సీఎం కేసీఆర్ పై గౌరవంతో ఉన్నా.. టికెట్ మార్చని పక్షంలో నేను ఇండిపెండెంటుగానైనా పోటీ చేయడం ఖాయం. ఇండిపెండెంటుగా కూడా నాకు మద్దతు తెలపాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, ఇతర నాయకులను కోరుతున్నా’’ అని కోదాడ బీఆర్ఎస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇపుడు కోదాడ రాజకీయాలు రసకందాయంలో పడినట్లు అయ్యాయి.
శశిధర్ రెడ్డే ఎందుకు?
కోదాడ నియోజకవర్గంలో తలెత్తిన అసమ్మతిపై నీళ్లు చల్లే ప్రయత్నాలు ఇంకా జరగలేదు. ఈ లోగానే అసమ్మతి నాయకులంతా విడతల వారీగా సమావేశమవుతున్నారు. తాజాగా జరిగిన ఆత్మీయ సమావేశంలో శశిధర్ రెడ్డి తన పోటీపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి శశిధర్ రెడ్డి పార్టీలో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీలో ఆయనే సీనియర్. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.పద్మావతి రెడ్డి విజయం సాధించగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ 68 వేల పైచిలుకు ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయనకు ఆ స్థాయిలో వచ్చిన ఓట్ల సంఖ్యను ఆధారం చేసుకునే.. 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ ను పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్ ఆయనను పోటీకి పెట్టింది. దీంతో బొల్లం రూపంలో బీఆర్ఎస్ కోదాడలో విజయం సాధించింది. 2018 లో తాను టికెట్ త్యాగం చేశాను కాబట్టి, ఈ సారి ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి తనకు టికెట్ ఇవ్వాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న సానుభూతి ఈ సారి వర్కౌట్ అవుతుందున్న అంచనాతో అసమ్మతి నేతలంతా శశిధర్ రెడ్డిని ముందు పెడుతున్నారు. దీంతో ఆయన కూడా ఈసారి ఇండిపెండెంటుగానైనా పోటీ చేసి అమితుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.