Kishan reddy Protest: రెండో రోజు కొనసాగుతున్న కిషన్ రెడ్డి నిరాహార దీక్ష
Kishan reddy Protest: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పార్టీ కార్యాలయంలో కొనసాగిస్తున్నారు. కిషన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసినా కార్యకర్తలతో కలిసి పార్టీ ఆఫీసులో కొనసాగిస్తున్నారు.
Kishan reddy Protest: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరోజు నిరసనకు దీక్ష చేపట్టారు. అయితే అనుమతించిన గడువు ముగిసిందంటూ ఉద్రిక్తతల మధ్య కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇందిరా పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు.
దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 20 గంటలుగా కిషన్ రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. కిషన్ రెడ్డికి నిరుద్యోగ యువతతో పాటు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. బుధవారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రభుత్వ వైఖరికి అక్రమ అరెస్ట్ నిరసనగా గురువారం కూడా రాష్ట్ర వ్యాపంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలించడంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారికి ఛాతీలో గాయాలు అయ్యాయి. కిషన్ రెడ్డి చేతులపై, ఛాతీపై, ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గీరుకుపోయాయి.
రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు గోళ్లు గీరుకుపోయిన చోట్ల ఆయింట్‌మెంట్ ఇవ్వడంతోపాటుగా.. ఛాతీలో అయిన గాయానికి రేపు ఉదయం ఎక్స్‌రే తీసుకోవాలని సూచించారు.
నిరుద్యోగులకు కేసీఆర్ చేసిన మోసాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని దీక్షాస్థలి నుంచి అక్రమంగా తరలించడాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ ఖండించారు. దీక్షను ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నా పోలీసులు అక్రమంగా వ్యవహరించారని మండిపడ్డారు.
కిషన్ రెడ్డి చేస్తున్న దీక్షకు.. తెలంగాణ నిరుద్యోగ యువతనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో.. జీర్ణించుకోలేకే కేసీఆర్ ఇలా పోలీసులను పురమాయించారన్నారు.
జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేదని ప్రశ్నించారు. పోలీసుల తోపులాటలో కిషన్ రెడ్డికి గాయాలయ్యాయని, పోలీసుల వ్యవహారశైలి అక్రమమన్నారు. బీజేపీ చేపడుతున్న శాంతియుత నిరసన ప్రదర్శనను కూడా కేసీఆర్ తట్టుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో యువత.. కేసీఆర్ కు సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు.