BJP Kishan Reddy: కాంగ్రెస్‌ విజయభేరీకి కేసీఆర్‌ స్పాన్సర్‌ అని ఆరోపించిన కిషన్‌రెడ్డి-kishan reddy said that kcr sponsored congress vijayabheri ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Kishan Reddy Said That Kcr Sponsored Congress Vijayabheri

BJP Kishan Reddy: కాంగ్రెస్‌ విజయభేరీకి కేసీఆర్‌ స్పాన్సర్‌ అని ఆరోపించిన కిషన్‌రెడ్డి

HT Telugu Desk HT Telugu
Sep 19, 2023 06:08 AM IST

BJP Kishan Reddy: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయభేరీ సభకు తెలంగాణ సిఎం కేసీఆర్ స్పాన్సర్షిప్ అందించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

BJP Kishan Reddy: తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరీ సభకు కేసీఆర్ స్పాన్సర్ చేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీని తొక్కడానికి కాంగ్రెస్,బిఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని రెండు పార్టీలకు ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తుందని, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

కేటీఆర్ ట్వీట్ పై కిషన్ రెడ్డి కౌంటర్..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ ఆవిర్భావం సరిగా జరగలేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “ మోడీ తెలంగాణ విరోధి “ అంటూ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసిఆర్ కుటుంబానికి తెలంగాణ విమోచనా దినానికి సమైక్యతా దినానికి తేడా కూడా తెలియదని వ్యాఖ్యానించారు.

ప్రధాని పార్లమెంట్‌లో ఎవ్వరినీ విమర్శించలేదని ఎవ్వరినీ అవమానించలేదని కేవలం పార్లమెంట్ లో నిలిచిన అంశాలపైన మాత్రమే చర్చలు జరిపారని విభజన సమయంలోనూ ఎక్కడా కారం,పెప్పర్ స్ప్రే వంటివి వాడదలేదని ఆయన స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుని అధికారాన్ని పంచుకుని.. తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. 4 కోట్ల మంది ప్రజలకు నిరంతర పోరాటం తర్వాత అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిందన్నారు.

42 రోజుల పాటు తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే కానీ స్పందించని పార్టీ కాంగ్రెస్ అని, హామీ ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ అంటోందని, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి మీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో కాంగ్రెస్ పార్టీ రాలేదని, 1952 నుంచి కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 1971లో గరీబీ హటావో, 16 పాయింట్ పార్ములా.. ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదన్నారు.

హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మోసపూరితమైనవని, గతంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేని పరిస్థితి ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు ఎన్నో జరిగాయని, దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే వారికి తెలుసన్నారు. ఈ హామీలల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప.. ఇవేవీ అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీదన్నారు.

అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది వేటినీ అమలు చేయడం లేదుని, కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సమావేశం.. బీఆర్ఎస్ స్పాన్సర్ చేసిన సమావేశమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత పెంచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తే.. మా కార్యకర్తలమీద జులూం ప్రదర్శించారు. చాలా మంది ఇంకా ఆసుపత్రుల్లో ఉన్నారని, ప్రభుత్వం,పోలీసులు ధర్నాచౌక్ లో అనుమతిచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదని ఇవాళ కాకపోయినా.. ఎన్నికల తర్వాతైనా కలిసే పార్టీలేనని ఆరోపించారు. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నా, బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు.

తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదని, తెలంగాణ విమోచన దినోత్సవం రోజు హైదరాబాద్ లో సమావేశం పెట్టుకుని కనీసం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.

WhatsApp channel