ఆగుతూ.. సాగుతూ.. యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు.. కిషన్ రెడ్డి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు-kishan reddy said funds have sanctioned for the mmts train project to yadadri ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆగుతూ.. సాగుతూ.. యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు.. కిషన్ రెడ్డి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు

ఆగుతూ.. సాగుతూ.. యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు.. కిషన్ రెడ్డి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు

యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు రాబోతోందని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అడుగులు పడలేదు. కానీ.. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటనతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని.. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని కిషన్ రెడ్డి వివరించారు.

ఎంఎంటీఎస్‌ రైలు

అమృత్‌భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద.. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. జూన్‌లో ప్రాథమిక పనులు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కోరారు.

భక్తులకు సౌకర్యంగా..

ఘట్‌కేసర్‌ నుంచి యాదగిరిగుట్టకు రోజూ 50వేల పైచిలుకు మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఎంఎంటీఎస్‌ షటిల్‌ సర్వీసులు ప్రారంభించాలని స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ సందర్శనకు హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ఎంఎంటీఎస్‌ రైలు సౌకర్యంగా ఉంటుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రూ.50 కోట్లతో గతంలో డీపీఆర్, రైల్వే లైన్‌ పనులకు సర్వేలు నిర్వహించాయి.

వైఎస్సార్ టు రేవంత్ రెడ్డి..

2004 నుంచి అప్పటి సీఎం వైఎస్సార్ మొదలు.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వరకు ఎంఎంటీఎస్‌ విస్తరణ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నిధులు మంజూరు కాకపోవడంతో.. పనులు మొదలు కాలేదు. మొదట్లో సికింద్రాబాద్‌ నుంచి భువనగిరి వరకు ఎంఎంటీఎస్‌ విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. క్రమంగా ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2016లోనే రూ.330 కోట్ల అంచనా నిర్మాణ వ్యయంతో అప్పట్లో ఎంఎంటీఎస్‌ ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో రూ.220 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన నిధులు కేంద్రం భరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

జాప్యం కారణంగా..

అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించడంలో జాప్యం నెలకొనడంతో.. ఆ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌ నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి.. ఒక్కోటికెట్‌కు గరిష్ఠంగా రూ.150 వెచ్చించి రోడ్డు మార్గం వెళ్లే భక్తులకు రెండు గంటల వరకు సమయం పడుతోంది. అదే ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తే.. ఒకరికి రూ.20 మాత్రమే చెల్లించి సికింద్రాబాద్‌ నుంచి కేవలం 45 నిమిషాల నుంచి గంట వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చు.

కేంద్రమే భరించేలా..

రెండేళ్ల కిందట మరోసారి ఎంఎంటీఎస్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వమే చేపట్టేలా నిర్ణయం తీసుకోగా.. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.330 కోట్ల నుంచి రూ.464 కోట్ల వరకు పెరిగింది. ఎంఎంటీఎస్‌ విస్తరణలో భాగంగానే.. ఘట్‌కేసర్‌- యాదాద్రి మధ్య 33 కిలోమీటర్ల మేర మూడో రైల్వేలైన్‌ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పార్లమెంట్‌లో ఇటీవలే ప్రకటించారు. తాజాగా కిషన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించడంతో.. మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

సంబంధిత కథనం