Khammam News : కొడుకులుంటే కీడంట, కీడుకు పరిష్కారం గాజులట-khammam news in telugu superstition viral two sons mother give money to one son woman ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam News : కొడుకులుంటే కీడంట, కీడుకు పరిష్కారం గాజులట

Khammam News : కొడుకులుంటే కీడంట, కీడుకు పరిష్కారం గాజులట

HT Telugu Desk HT Telugu

Khammam News : తెలుగు రాష్ట్రాల్లో ఓ మూఢ నమ్మకం బాగా ప్రచారం అవుతుంది. ఇద్దరు కొడుకులు ఉన్న మహిళల వద్ద ఒక్క కొడుకు ఉన్న మహిళలు డబ్బులు తీసుకుని గాజులు వేసుకోవాలనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మొద్దని నిపుణులు అంటున్నారు.

గాజులు

Khammam News : తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రచారం పుట్టుకొచ్చింది. మూఢ నమ్మకాలను తొందరగా విశ్వసించే ప్రజలు ఒక కొత్త విశ్వాసాన్ని తెరపైకి తెచ్చి ఆచరిస్తున్నారు. ఆచరించడమే కాదు.. అందరూ ఆచరించేలా "మౌత్ టాక్"తో తెలంగాణ అంతటా వెలుగులోకి తెచ్చారు. అదేంటో తెలుసా? దాని పేరే "గాజుల కానుక". ఇప్పుడు ఈ గాజుల కానుక ప్రచారం ఎవరి నోట చూసినా వినిపిస్తుంది. ఇద్దరు కొడుకులు ఉన్న మహిళల వద్ద ఒక్క కొడుకు ఉన్న మహిళలు డబ్బులు అప్పుగా తీసుకోవాలాట. ఆ డబ్బులతో ఐదు రకాల గాజులను కొనుగోలు చేసి వాటిని చేతికి వేసుకోవాలట. అప్పుడు వారికి ఎలాంటి కీడు ఉండదట. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ఈ నయా మూఢ నమ్మకం ట్రెండింగ్ లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నోళ్లలో నానుతున్న ఈ నయా సంప్రదాయం ఫాలో కాని పక్షంలో కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది.

మూఢ నమ్మకాలను బాగా విశ్వసించే జనం కొందరు అదే పనిగా దీన్ని ఆచరిస్తూ తమ చుట్టు పక్కల ప్రజలకు కూడా తెలియజెబుతున్నారు. అందరూ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యేలా కొందరు పనిగట్టుకుని ఫోన్లు చేస్తూ ఆచరించేలా చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఎక్కడ చూసినా ఆడపడుచుల గాజుల వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. ఈ మూఢ నమ్మకం పుణ్యమాని గాజుల దుకాణదారులకు భలే గిరాకీ తగిలింది. గాజులకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు కొందరు నిపుణులు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మొద్దని సూచిస్తున్నారు. గాజులు వేసుకున్నంత మాత్రాన వచ్చేదీ లేదు.. వేసుకోకపోతే జరిగేదీ ఏం ఉండదని చెబుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలే తప్ప మూఢ విశ్వాసంతో కాదని నొక్కి వక్కాణిస్తున్నారు. ఏదేమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళామణులు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం