Doctor's Health : షాకింగ్ సర్వే! ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యుల్లో ఎక్కువ ఒత్తిడి, తగ్గిపోతున్న ప్రాణదాత ఆయుష్షు-khammam news in telugu shocking survey nationwide doctors facing severe stress decreases life span ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Doctor's Health : షాకింగ్ సర్వే! ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యుల్లో ఎక్కువ ఒత్తిడి, తగ్గిపోతున్న ప్రాణదాత ఆయుష్షు

Doctor's Health : షాకింగ్ సర్వే! ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యుల్లో ఎక్కువ ఒత్తిడి, తగ్గిపోతున్న ప్రాణదాత ఆయుష్షు

HT Telugu Desk HT Telugu
Feb 25, 2024 08:08 PM IST

Doctor's Health : ఇటీవల సర్వేల్లో షాకింగ్ విషయం తెలిసింది. రోగి ప్రాణాలు నిలిపే వైద్యుల ఆయుష్షు 18 శాతం తగ్గిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. వైద్యులు తీవ్ర మానసిక ఒత్తిడి లోనవుతున్నారని, నాసా లేదా ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యులు 10 రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని తెలుస్తోంది.

ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యుల్లో ఎక్కువ ఒత్తిడి
ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యుల్లో ఎక్కువ ఒత్తిడి (pixabay)

Doctor's Health : మన గుండెల మీద స్టెత్‌ పెట్టినప్పుడు.. మందుల చీటీ రాసినప్పుడు.. సూది మందు వేసినప్పుడు.. చెయ్యెత్తి ఎక్స్‌రే ఫిల్మ్‌ను చూసినప్పుడు.. ఆపరేషన్‌ బల్లమీద మరేం పర్వాలేదని రోగికి ధైర్యం చెప్పినప్పుడు.. డిశ్చార్జ్ సమయంలో ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి.. అని భుజంపై చెయ్యేసి చెప్పినప్పుడు.. మన కండ్ల ముందు వైద్యుని రూపంలో ఉన్న ఒక దేవుడినే చూస్తాం. అందుకే వైద్యో నారాయణోహరి: అంటారు. మరి అలాంటి దేవుళ్లే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటే..? ఆత్మహత్యలకు పాల్పడుతుంటే..? రోగి ప్రాణం నిలిపే వైద్యుల(Doctors Health) ఆయుష్షు 18 శాతం తగ్గిపోతుంటే..? ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుండెల్ని పిండేస్తున్న కఠోర వాస్తవమిది. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో వైద్యులు, వైద్య విద్యార్థులు వారి ఆయుష్షును కోల్పోతున్నారని సర్వేల్లో తేటతెల్లమైన సంచలన విషయాలు కుంగదీస్తున్నాయి. 40 ఏండ్ల లోపు వయసున్న వైద్య విద్యార్థులకు గుండెపోటు వస్తోందనీ, ఏకంగా 37.2శాతం మంది వైద్య విద్యార్థుల్లో ఆత్మ హత్యల ఆలోచనలు రేకెత్తుతున్నాయన్న సర్వే(Survey) నివేదికలు అవాక్కయ్యేలా చేస్తున్నాయి.. నడిచే దేవుళ్లుగా చెప్పుకునే వైద్యులు, వైద్య విద్యార్థులు ఇంతటి మానసిక సంఘర్షణకు గురవుతున్నారనడానికి సరిగ్గా వారం రోజుల్లో మన దేశంలో నలుగురు వైద్యులు ఆత్మహత్యల రూపంలో, గుండెపోటు రూపంలో తనువు చాలించడమే సజీవ సాక్ష్యమని మానసిక వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నాసా, ఇస్రో శాస్త్రవేత్తల కన్నా 10 రెట్లు ఒత్తిడిలో వైద్యులు..

ప్రాణ దాతలుగా చెప్పుకునే వైద్యులు ప్రస్తుతం ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఒత్తిడిని(Mental Stress) కలిగి ఉన్నట్టు సర్వేలు చెపుతున్నాయి. అది ఎంతలా అంటే అంతరిక్ష నౌకలను ప్రయోగించే నాసా లేదా ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యులు 10 రెట్లు ఎక్కువ ఒత్తిడిని పొందుతున్నారని అంచనా వేశారు. ఈ క్రమంలోనే వైద్యుల జీవితకాలం 18శాతం తగ్గిందని ఐఎంఏ కేరళ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాక భారతీయ వైద్య విద్యార్థులలో ఆత్మహత్యల రేటు సంవత్సరానికి 30/100000 మెడికల్‌ యుజీ, పీజీ విద్యార్థులు. సాధారణ జనాభా కంటే 2.5 రెట్లు ఎక్కువగా నిర్థారించారు. దాదాపు 27 శాతం మంది వైద్య విద్యార్థులు డిప్రెషన్‌కు సంబంధించిన ప్రమాణాలను కలిగి ఉన్నారు. అయితే వారిలో 16 శాతం కంటే తక్కువ మంది చికిత్స పొందారని నివేదికలు చెపుతున్నాయి.

40 ఏండ్ల లోపు వయసున్న 13 శాతం మందికి తప్పని ప్రమాదం

ఇటీవల అమెరికన్‌ పరిశోధన ప్రకారం 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో ఆకస్మిక గుండె స్తంభన 13శాతం పెరుగుదల ఉన్నట్లు గమనించారు. 2023లో 787 మంది ఉత్తర భారత వైద్య విద్యార్థుల సర్వేలో 37.2 శాతం మంది ఆత్మ హత్య ఆలోచనలు, 10.9 శాతం మంది ఆత్మహత్య ప్రణాళికలు కలిగి ఉన్నారు. అలాగే 3.3 శాతం మంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న వైద్యుల వరుస మరణాలు కలవర పాటుకు గురిచేస్తున్నాయి. కోవిడ్‌ సమయంలోనూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది వైద్య నిపుణులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మరికొన్ని సందర్భాల్లో కొందరు వైద్యుల్లోని వ్యాపార ధోరణి, రోగి నాడి పట్టే దగ్గర నుంచి ఆపరేషన్‌, డిశ్చార్జీ వరకూ అంతా ప్రతీదీ వ్యాపార ధోరణిలో చూడటంలాంటి అవలక్షణాలు ప్రజల్లో వైద్యుల పట్ల చులకన భావం కలిగిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకరిద్దరి చర్యల వల్ల యావత్‌ వ్యవస్థను నిందించే వారూ ఉన్నారు.

వారం రోజుల్లో నలుగురు వైద్యుల మరణాలు..

ఇటీవల దేశంలో జరుగుతున్న వైద్యులు, వైద్య విద్యార్థుల మరణాలను గమనిస్తే భయంకరమైన నిజాలు వెల్లడవుతున్నాయి. ప్రధానంగా కర్నూలులో అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ సరిగ్గా నాలుగు రోజుల కిందట తెల్లవారు జామున గుండెపోటు(Heart Attack)తో ప్రాణాలు కోల్పోయారు. 2 రోజుల క్రితం శ్రవణ్‌ వెంటిలేటర్‌ పై ఉన్న రోగిని పర్యవేక్షించారు. ఆ సమయంలో వైద్యులు పేషెంట్‌ అటెండర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రోగి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినా బంధువులు అందుకు నిరాకరించారు. రోగి ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని పట్టుబట్టారు. శ్రవణ్ రాత్రంతా ఆసుపత్రిలోనే ఉండిపోయారు. అర్ధరాత్రి శ్రవణ్‌కి కొంత అసౌకర్యంగా అనిపించింది. పాంటాప్ ఇంజక్షన్‌ తీసుకుని నిద్రపోయాడు. తెల్లవారు జామున నిద్ర లేవలేదు. తమిళనాడులో 48 గంటల్లో నలుగురు యువ వైద్యుల మరణాలు భారతదేశం అంతటా డాక్టర్లు, నర్సుల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. డాక్టర్‌ గౌరవ్‌ గాంధీ(41) కార్డియాక్‌ సర్జన్‌, డాక్టర్‌ విజయ్‌ సురేష్‌ కన్నా(38) ఎండీ వైద్యుడు, చెన్నైలోని స్టాన్లీ మెడికల్‌ కాలేజీకి చెందిన 46 ఏళ్ల ఈఎన్‌ టీ సర్జన్‌ సతీష్‌ కుమార్‌, 24 ఏళ్ల ఫైనల్‌ ఎంబీబీఎస్‌ మెడికల్‌ విద్యార్థి దనుష్‌ తమ ఆసుపత్రుల్లో చురుకుగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు హఠాత్తుగా మరణించారు. వారంతా ఫిట్‌గా ఉన్నారని, పొగతాగడం లేక మద్యం సేవించే అలవాట్లు కూడా లేవని పరీక్షల్లో తేలింది. వీరి మరణాలతో వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం