Old 100 Notes :పాత రూ.100 నోట్ల రద్దుపై పుకార్లు షికారు, ఆర్బీఐ క్లారిటీ!
Old 100 Notes : పాత రూ.100 నోట్లు రద్దు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. పాత రూ.100 నోట్ల రద్దు చేయడంలేదని స్పష్టం చేసింది.
Old 100 Notes : పాత రూ.100 నోట్లు రద్దు అవుతుందా? 2024 మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఈ నోటు చెలామణీలో ఉంటుందా? ఇప్పుడు ఈ సందేహాలు జనం మెదళ్లను తొలుస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంత? నిజంగానే ఆర్బీఐ ఈ ప్రకటన చేసిందా? అంటే ఇవి కేవలం పుకార్లుగానే అర్ధం చేసుకోవాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోట్ల రద్దు భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ కి గురయ్యారు. అ తరువాత ముద్రించిన రూ. 2 వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ గడువు ఇచ్చింది. ఎవరి వద్దనైనా రూ.2 వేల నోటు ఉంటే బ్యాంకుల్లో జమ చేయాలని సూచిందింది. దీంతో బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇదంతా ఎలా ఉన్నా.. సామాన్యులు మొదటిసారి నోట్ల రద్దు సమయంలో పడినంత ఇబ్బందులు రూ. 2వేల నోటు రద్దు సమయంలో పడలేదు. దీనికి కారణం ఎవరి దగ్గరా పెద్దగా ఈ పెద్ద నోట్లు లేకపోవడమే.
రూ.100 నోట్లు రద్దుపై పుకార్లు
అయితే తాజాగా రూ.100 నోటు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒకరు వంద నోటుపై పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో పాత వంద నోట్లు రద్దవుతాయని దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. 2024 మార్చి 31 వరకు మాత్రమే పాత వంద రూపాయల నోటు చెలామణి అవుతుందని, ఆ తరువాత నిషేధం విధిస్తున్నట్లు ఈ ప్రచారం సాగుతోంది. దీంతో కొందరు దుకాణదారులు పాత వంద నోట్లను తీసుకునేందుకు జంకుతున్నారు. పాత వంద నోట్లను రద్దు చేస్తూ ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? అంటూ ఆర్బీఐకి కొందరు ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏం జారీ చేయలేదని బదులిచ్చింది. ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితిలో వంద నోట్లను రద్దు చేయబోమని తెలిపింది. దీంతో వంద నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం అని తేలింది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.