Ponguleti Joins Congress : బీఆర్ఎస్ ను ఇంటికి పంపేది కాంగ్రెస్ పార్టీనే- పొంగులేటి-khammam janagarjana meeting ex mp ponguleti joins congress rahul gandhi welcomes ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponguleti Joins Congress : బీఆర్ఎస్ ను ఇంటికి పంపేది కాంగ్రెస్ పార్టీనే- పొంగులేటి

Ponguleti Joins Congress : బీఆర్ఎస్ ను ఇంటికి పంపేది కాంగ్రెస్ పార్టీనే- పొంగులేటి

Bandaru Satyaprasad HT Telugu
Jul 02, 2023 07:17 PM IST

Ponguleti Joins Congress : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Joins Congress : ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభం అయింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్​ మార్చ్​ పాదయాత్ర నేటితో ముగిసింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ... పొంగులేటికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, మువ్వ విజయ్ బాబు, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పలువురు నేతలు హస్తం పార్టీలో చేరారు. పొంగులేటి అనుచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ రాహుల్ కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ జనగర్జనకు అడ్డంకులు సృష్టించారు

అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో వేయాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాయమాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీనే అని పొంగులేటి అన్నారు. అధికారంలోకి రాగానే డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా రైతులు, యువతకు ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తామన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీనే ఇంటికి పంపిస్తుందన్నారు. కాంగ్రెస్ జనగర్జన సభకు అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వారం రోజులుగా ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం

తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకుని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోతుందని తెలిసినా రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. రెండు సార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చినా... ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆరు నెలల పాటు అన్ని వర్గాలను కలిసి, వారి నిర్ణయం మేరకు కాంగ్రెస్ లో చేరారని పొంగులేటి స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేయడం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమవుతుందన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలన్నారు.

Whats_app_banner