Gubbala Mangamma Temple : దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువై గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి బ్రేక్ పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాలకు గుబ్బల మంగమ్మ దేవాలయం పూర్తిగా నీట మునిగింది. దీంతో గడిచిన మూడు రోజులుగా గుబ్బల మంగమ్మ దైవ దర్శనానికి ఆలయ కమిటీ నిర్వాహకులు బ్రేక్ వేశారు. గుబ్బల మంగమ్మ అమ్మ వారిని దర్శించుకున్నందుకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లా, ఖమ్మం జిల్లాల నడుమ దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ దేవాలయం నెలకొంది. ఈ దేవాలయం చుట్టూ భారీ వృక్షాలతో కూడిన అటవీ ప్రాంతం ఉంది. గిరిజన ఆరాధ్య దైవంగా కొలుచుకునే గుబ్బల మంగమ్మ దైవ దర్శనానికి నిత్యం ప్రజలు వెళుతుంటారు. ప్రత్యేకించి ప్రతి ఆది, మంగళవారాల్లో భారీ ఎత్తున భక్తులు పోటెత్తుతారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా ప్రజలు గుబ్బల మంగమ్మను దర్శించుకునేందుకు తరలి వెళ్తుంటారు. చుట్టూ చెట్లు, భారీ కొండ కోనల నడుమ ఈ దేవాలయం నెలకొంది. గిరిజనుల కొంగు బంగారంగా కొలుచుకునే ఈ గుడిపై భాగం నుంచి ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటి ప్రవాహం ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరు గుర్తించలేకపోయారు.
కోరిన కోరికలు తీర్చే దైవంగా గుబ్బల మంగమ్మను కొలుచుకుంటారు. వనవాస సమయంలో సాక్షాత్తు ఆ సీతారాములు ఈ ప్రాంతంలో నడయాడినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే ద్వాపర యుగంలో పాండవులు సైతం వనవాసం చేసిన ప్రాంతంగా దేనిని చెబుతారు. దీనిని బట్టి గుబ్బల మంగమ్మ దేవాలయం త్రేతాయుగం నాటిదిగా చరిత్ర చెబుతోంది. కాగా తాజాగా భారీ వర్షాలకు అటవీ ప్రాంతం మొత్తం నీటి ప్రవాహంతో నిండిపోయింది. దేవాలయంపై భాగం నుంచి భారీ ఎత్తున వరద కిందికి ప్రవహిస్తోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాలకు కూడా ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల గుబ్బల మంగమ్మ దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్లవద్దని ఆ దేవాలయం కొలువై ఉన్న బుట్టాయిగూడెం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దేవాలయం మార్గంలో చెట్లు విరిగిపడ్డాయి. ఆలయ నిర్వాహకులు విరిగిపడిన చెట్ల తొలగిస్తున్నారు. వర్షాలు తగ్గే వరకు భక్తులు సంయమనం పాటించాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం