Ponguleti Jupally : కాంగ్రెస్ గూటికే పొంగులేటి, జూపల్లి-చేరికకు ముహూర్తం ఫిక్స్!-khammam ex mp ponguleti srinivas reddy jupally krishna rao joins in congress on june 2nd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Khammam Ex Mp Ponguleti Srinivas Reddy Jupally Krishna Rao Joins In Congress On June 2nd

Ponguleti Jupally : కాంగ్రెస్ గూటికే పొంగులేటి, జూపల్లి-చేరికకు ముహూర్తం ఫిక్స్!

Bandaru Satyaprasad HT Telugu
May 21, 2023 05:41 PM IST

Ponguleti Jupally : కర్ణాటక ఫలితాలు, రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ పిలుపుతో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ గూటికే చేరుతున్నట్లు మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది.

పొంగులేటి, జూపల్లి
పొంగులేటి, జూపల్లి

Ponguleti Jupally : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును తమ పార్టీల్లోకి ఆహ్వానించాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే నేను ఒకటి కాదు పది మెట్లు దిగేందుకు సిద్ధంగా ఉన్నా.... పార్టీని వీడిన వాళ్లంతా తిరిగి రండి అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరాలని దిల్లీ నుంచి రాహుల్ గాంధీ టీమ్ ఇప్పటికే పొంగులేటితో చర్చలు కూడా జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో రెండు మినహా మిగిలిన ఎనిమిది సీట్లు పొంగులేటి సూచించిన అభ్యర్థులకు కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ కూడా ఇచ్చింది. బీజేపీ చేరికల కమిటీ కూడా ఇటీవల రంగంలోకి దిగింది. ఈటల రాజేందర్ నేతృత్వంలో ఓ బృందం పొంగులేటి, జూపల్లితో ఖమ్మంలో చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం సీట్లు పొంగులేటి చెప్పిన అభ్యర్థులకే ఇస్తామని ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కర్ణాటక ఫలితాల అనంతరం పొంగులేటి, జూపల్లి ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరేందుకే ఆ ఇద్దరు నేతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. జూన్ 2న వారిద్దరూ కాంగ్రెస్ గూటికే చేరనున్నట్లు పొంగులేటి, జూపల్లి ముఖ్య అనుచరులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఖమ్మంలో కాంగ్రెస్ కు పట్టు

గత కొంత కాలంగా ఏ పార్టీలో చేరాలో ఎలాంటి నిర్ణయం తీసుకోని పొంగులేటి, జూపల్లికి కర్ణాటక ఎన్నికలతో క్లారిటీ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ అవతరణ రోజైన జూన్ 2న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండడం, కర్ణాటక ఎన్నికల్లో విజయంతో ఈ ఇద్దరూ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉండడంతో పొంగులేటి, జూపల్లి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని వీరి ముఖ్య అనుచరులు అంటున్నారు. అయితే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద బలం వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతే వీరిద్దరూ ప్రొఫెసర్ కోదండరాంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా వీరితో కలిసి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ముహూర్తం ఫిక్స్?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అసంతృప్త నేతలు చేతులు కలుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏ పార్టీలో చేరాలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు మంచి పట్టుండడంతో పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే ఆయనకు, పార్టీకి లాభం జరుగుతుందని అనుచరులు భావిస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ వ్యతిరేకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇటీవల రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ గూటికే చేరనున్నారని సమాచారం. జూన్ 2న లేదా 8వ తేదీన పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

IPL_Entry_Point