Khammam Crime : అక్కచెల్లెమ్మలంటూ తియ్యని మాటలు, బోగస్ ఆస్తి పత్రాలతో రూ.2.08 కోట్లు కొట్టేసిన ఘనుడు-khammam crime news man cheated 32 women put fake documents for mortgage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Crime : అక్కచెల్లెమ్మలంటూ తియ్యని మాటలు, బోగస్ ఆస్తి పత్రాలతో రూ.2.08 కోట్లు కొట్టేసిన ఘనుడు

Khammam Crime : అక్కచెల్లెమ్మలంటూ తియ్యని మాటలు, బోగస్ ఆస్తి పత్రాలతో రూ.2.08 కోట్లు కొట్టేసిన ఘనుడు

HT Telugu Desk HT Telugu
Jun 15, 2024 08:54 PM IST

Khammam Crime : అమ్మ, అక్క, చెల్లి అంటూ తియ్యగా మాట్లాడి...నకిలీ ఆస్తి పత్రాలు తనఖా పెట్టి 32 మంది మహిళల వద్ద రూ.2.08 కోట్లు కొట్టేశాడో కేటుగాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అక్కచెల్లెమ్మలంటూ తియ్యని మాటలు, బోగస్ ఆస్తి పత్రాలతో రూ.2.08 కోట్లు మోసం
అక్కచెల్లెమ్మలంటూ తియ్యని మాటలు, బోగస్ ఆస్తి పత్రాలతో రూ.2.08 కోట్లు మోసం
yearly horoscope entry point

Khammam Crime : కాగితాలపై ఆస్తిని చూపించాడు. ఆకాశంలో మేడలు కట్టాడు. అక్క, చెల్లి అంటూ వల్లమాలిన ఆప్యాయత కురిపిస్తూ అధిక వడ్డీకి అప్పులు అడిగాడు. అతని హంగు, ఆర్భాటం చూసి నమ్మిన మహిళలు నకిలీ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకుని లక్షల్లో అప్పు ఇచ్చారు. పిల్లల భవిష్యత్ కోసం ఒక్కో రూపాయి పోగేసుకున్న సొమ్మును అతని చేతిలో పోసి చివరికి మోసపోయారు. బోగస్ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి 32 మంది నుంచి రూ. 2 కోట్ల 8 లక్షలు భారీ మొత్తాన్ని కొల్లగొట్టిన ఓ ఘనుడు చివరికి అన్నీ సర్దుకుని ఉడాయించిన ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.

వృద్ధురాళ్లు, ఒంటరి, అమాయక మహళలే లక్ష్యంగా

మహిళల బతుకుల్ని రోడ్డు పాల్జేసి పరారైన మోసగాడు క్షత్రియ రవీంద్రనాథ్ సింగ్ ను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు విలేకర్ల ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనకపూడి లక్ష్మి, ఆళ్ల నాగేంద్రమ్మ, ఎగ్గనం పద్మ, కొనకండ్ల ఉషారాణి, కొనకండ్ల పద్మ తదితర మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత వివరాలను వెల్లడించారు. ఖమ్మంలోని శాంతినగర్, మిషన్ హాస్పిటల్ రోడ్, పోలీస్ లైన్ పరిసర ప్రాంతాలకు చెందిన 32 మంది పేద, మధ్య తరగతి మహిళల నుంచి డబ్బు కాజేసిన మోసగాడి ఉదంతం సంచలనంగా మారింది. వృద్ధురాళ్లు, ఒంటరి, అమాయక మహళలే లక్ష్యంగా అమ్మా, అక్కా, చెల్లి అని సంబోధిస్తూ అధిక వడ్డీ ఆశ చూపి భారీ మొత్తంలో డబ్బు కాజేసే కేటుగాడి గురించి ప్రజలకు తెలియజేయటంతో పాటు తమలా ఇతర మహిళలు మోసగాడి వలకు చిక్కకుండా జాగ్రత్త పరచాలన్న ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. కనకపూడి లక్ష్మి అనే వృద్ధురాలు మాట్లాడుతూ రవీంధ్రనాధ్ సింగ్ తన డబ్బు తీసుకొని ఉడాయించటం వల్ల దిక్కులేని స్థితికి గురయ్యానని విలపించింది. రవీంద్రనాథ్ సింగ్ మధ్యవర్తిగా ఉండి తనకు రెండు గదుల ఇల్లు కొనిస్తానని నమ్మించి రూ.14లక్షల రూపాయలు తీసుకోవటంతో పాటు వడ్డీ చెల్లిస్తానని తన నుంచి మరో పాతిక లక్షలు కాజేశాడని చెప్పింది. ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాను అని నమ్మిస్తే రూ.5.80 లక్షలను తన బ్యాంకు ఖాతా ద్వారా రవీంద్రనాథ్ సింగ్ ఖాతాకు చెల్లించానని మిగతా డబ్బును నగదు రూపంలో అతని చేతికి ఇచ్చానని వాపోయింది.

నఖిలీ ఆస్తి పత్రాలు తనఖా

నాలుగో తరగతి చిరుద్యోగిగా రిటైర్డ్ అయ్యానని, తన రిటైర్మెంట్ డబ్బుపై కన్నేసిన రవీంద్రనాథ్ సింగ్ పథకం ప్రకారం ఆ డబ్బు కాజేశాడని వాపోయింది. అతను కుదవ పెట్టిన ఆస్తి పత్రాలను తనిఖీ చేయిస్తే అవి ఎందుకు పనికిరాని బోగస్ పత్రాలుగా తేలాయన్నారు. మిగతా మహిళలు మాట్లాడుతూ తాము రవీంద్రనాథ్ సింగ్ మాయ మాటల మోసానికి తాము ఎలా బలయ్యింది వివరించారు. తమను మోసం చేసి భారీ మొత్తంతో పత్తా లేకుండా పోయిన కేటుగాడు క్షత్రియ రవీంద్రనాథ్ సింగ్ ను పట్టుకొని తమకు న్యాయం చేయించాలని బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. తమను మోసగించిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని తమకు జరిగిన అన్యాయం పట్ల పోలీసులు సానుకూలంగా స్పందించి కేసు నమోదు చేసినా కేటుగాడిని వెదికి తాము మోసపోయిన డబ్బు ఇప్పించటంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Whats_app_banner

సంబంధిత కథనం