Khammam Crime : ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, భర్త మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంగా చిత్రీకరించిన ఈ ఘటనలో పోస్టు మార్టం కీలకంగా మారింది. భార్యకు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైంది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మే 28న బాబోజితండాకు చెందిన బోడా ప్రవీణ్ కుమార్, తన భార్య కుమారి(25), కూతుళ్లు కృషిక (4), తనిష్క(3)తో కలిసి కారులో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కనున్న చెట్టును కారు ఢీకొట్టింది. ఆ రహదారిపై వెళ్తున్నవారు ప్రమాదాన్ని గుర్తించి కారులోని వాళ్లను బయటకు తీశారు. అప్పటికే చిన్నారులు కృషిక, తనిష్క మరణించారు. స్పృహలో లేని ప్రవీణ్ భార్య కుమారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ స్వల్ప గాయాలు కావడంతో అతడిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. రోడ్డు ప్రమాదంలో కుమారి, ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రవీణ్.. భార్య, బిడ్డలను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని కుమారి బంధువులు ఆరోపించారు.
ఈ ఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన కారులో దొరికిన సిరంజ్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా...విషం కలిసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేసి ప్రవీణ్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. అందులో ఎంత మోతాదులో మత్తు మందు ఇంజక్షన్ ఇస్తే ఎన్ని గంటల్లో చనిపోతారనే విషయాన్ని ప్రవీణ్ గూగుల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా నిందితుడిపై హత్య చేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవీణ్.. తన భార్య కుమారితో పాటు ఇద్దరు కూతుళ్లను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సంబంధిత కథనం