TS Assembly Elections 2023: 'బీసీల జపం' చేస్తున్న ప్రధాన పార్టీలు..! టార్గెట్ ఇదేనా..?-key parties looks on bc vote bank in telangana over upcomming assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Key Parties Looks On Bc Vote Bank In Telangana Over Upcomming Assembly Elections 2023

TS Assembly Elections 2023: 'బీసీల జపం' చేస్తున్న ప్రధాన పార్టీలు..! టార్గెట్ ఇదేనా..?

HT Telugu Desk HT Telugu
May 21, 2023 05:30 AM IST

Telangana Assembly Elections: త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మోగబోతుంది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహలు - ప్రతివ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలు కూడా గెలిచే సెంటర్లపై కన్నేసి పెట్టాయి. ఇది ఇలా ఉంటే ప్రధాన పార్టీలన్నీ బీసీ అజెండాను ప్రకటించటం ఆసక్తికర పరిణామంగా మారింది

తెలంగాణలో 'బీసీల జపం' చేస్తున్న ప్రధాన పార్టీలు..!
తెలంగాణలో 'బీసీల జపం' చేస్తున్న ప్రధాన పార్టీలు..!

TS Assembly Elections 2023: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణ రాజకీయాలు హాట్ ను పుట్టిస్తున్నాయి. ఓవైపు నుంచి కామెంట్స్ రాగానే మరోవైపు నుంచి రియాక్షన్లు వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రధాన పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత... రాష్ట్రంలోనూ రాజకీయ వేడి మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలపై ఫోకస్ పెట్టేస్తున్న ప్రధాన పార్టీలు... వచ్చే ఎన్నికలకు సంబంధించి హామీలను కూడా ప్రకటించేస్తున్నాయి. ప్రత్యేకంగా డిక్లరేషన్లను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బీసీ ఓటు బ్యాంక్ పై కూడా కన్నేసి పెట్టడం... ప్రత్యేకంగా తీర్మానాలు చేస్తుండటం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు... బీసీలను నిమగ్నం చేసుకునే పనిలో పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీసీలను తమవైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో ఈ పార్టీలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ తెలంగాణ... ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట, బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ‘పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ఈ విషయాలన్నీ ప్రచారం చేస్తామని... అతి త్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతోంది. వీరిది ఇలా ఉంటే... అధికార బీఆర్ఎస్ మరోలా ముందుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బీసీలలో వెనకబడిన కులాలకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బీసీ నినాదంతో రాబోతుంది. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన సభ పెడతామని ప్రకటించారు.

ప్రధాన పార్టీల నిర్ణయాలు చూస్తుంటే... బీసీలను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా బీసీ సామాజికవర్గం ఓట్లు ఉన్న నేపథ్యంలో.... వారి ఎటువైపు మొగ్గు చూపుతే వారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 2014, 2018 ఎన్నికల్లో ఈ సామాజికవర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు... బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు ఎటువైపు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే అప్రమత్తమైన ప్రధాన పార్టీలు... ప్రత్యేకంగా సభలు, డిక్లరేషన్ ను ప్రకటించేస్తున్నాయి. మొత్తంగా మరికొద్ది నెలల పాటు ఎన్నికలకు సమయం ఉండగానే... ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దనే ఆలోచనలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది....!

IPL_Entry_Point

సంబంధిత కథనం