అభ్యర్థి ఎవరు..? ఎలా ముందుకెళ్దాం...! 'జూబ్లీహిల్స్ బైపోల్'పై పార్టీల ఫోకస్-key parties begin preparations for jubilee hills by election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అభ్యర్థి ఎవరు..? ఎలా ముందుకెళ్దాం...! 'జూబ్లీహిల్స్ బైపోల్'పై పార్టీల ఫోకస్

అభ్యర్థి ఎవరు..? ఎలా ముందుకెళ్దాం...! 'జూబ్లీహిల్స్ బైపోల్'పై పార్టీల ఫోకస్

రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందటంతో….జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ రానుంది. అయితే ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా… మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా పాగా వేసే దిశగా కసరత్తు చేసే పనిలో పడుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక - ప్రధాన పార్టీల కసరత్తు...!

రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెబుతుంటే… అలాంటి పరిస్థితే లేదంటోంది కాంగ్రెస్. ఇదే టైమ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు వాయిస్ పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

త్వరలోనే ఉపఎన్నిక….!

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈస్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైపోయింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రధాన పార్టీల కసరత్తు…!

జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో… ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోరుకు సిద్ధమయ్యే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సిట్టింగ్ సీటును కాపాడుకోవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధినాయకత్వం… అప్పుడే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇవ్వటమా..? లేక మరో నాయకుడిని తెరపైకి తీసుకురావటమా అనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. పీజేఆర్ కుమారుడైన విష్ణువర్థన్ రెడ్డితో పాటు రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అన్ని కోణాల్లో పరిశీలించి… అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.

ఇక అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు అప్పుడే ఉపఎన్నికపై రియాక్ట్ అవుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన… అజహరుద్దీన్ మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇదే విషయంపై తాజాగా మాట్లాడిన ఆయన… రానున్న ఉప ఎన్నికలో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని.. తప్పకుండా విజయం సాధిస్తానని స్పష్టం చేశారు.

ఇక ఇదే టికెట్ పై మరో నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఆశలు పెంచుకుంటున్నారు. అజహరుద్దీన్ కు టికెట్ రాకపోతే…. తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు. వీరిద్దరే కాకుండా మరికొంత మంది నేతలు కూడా ప్రయత్నాలు చేసే చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీకి కూడా ఈ ఉపఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకెల దీపక్​రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేకాకుండా కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కూడా పోటీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు ప్రధాన పార్టీల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఎంఐఎం పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. దీంతో సొంతంగా అభ్యర్థిని నిలుపుతుందా…? లేక అధికార కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమంటుందా అనే చర్చ కూడా వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ పోటీ చేయలేదు. మరీ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది..!

జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్​ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్​కు 64,212 ఓట్లు దక్కాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.