Telangana Secretariat : ఆ పోస్టులకు లైక్‌లు, షేర్‌లు కొట్టొద్దు.. ఉద్యోగులకు సీఎస్‌వో కీలక ఆదేశాలు!-key instructions of chief security officer to telangana secretariat security staff ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Secretariat : ఆ పోస్టులకు లైక్‌లు, షేర్‌లు కొట్టొద్దు.. ఉద్యోగులకు సీఎస్‌వో కీలక ఆదేశాలు!

Telangana Secretariat : ఆ పోస్టులకు లైక్‌లు, షేర్‌లు కొట్టొద్దు.. ఉద్యోగులకు సీఎస్‌వో కీలక ఆదేశాలు!

Telangana Secretariat : తెలంగాణలో బెటాలియన్ పోలీసుల ఆందోళన చర్చనీయాంశంగా మారింది. వీరి ఆందోళన నేపథ్యంలో.. ఉన్నతాధికారులు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. సెక్రెటేరియట్ సీఎస్‌వో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

తెలంగాణ సచివాలయం

తెలంగాణ సచివాలయ భద్రతా సిబ్బందికి.. చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రెటేరియట్ చుట్టూ 2 కిలో మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉందని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది కదలికలు, సోషల్‌ మీడియాపై నిఘా ఉందని ఆదేశాల్లో పేర్కొన్నారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ కావాలని ఆదేశించారు.

ప్రభుత్వం, పోలీసు శాఖకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా.. వాటిని లైక్ చేయొద్దని.. షేర్ చేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆదేశాలు ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు హైదరాబాద్ పరిధిలో 144 సెక్షన్ (ప్రస్తుతం సెక్షన్ 163 ) విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీల బహిరంగ సభలపై నిషేధం విధించినట్లు సీపీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరం అంతటా బహిరంగ సభలు, ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో మార్పులు చేర్పులు జరిగాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం ఇంటి దగ్గర ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బెటాలియన్‌ పోలీసుల ఆందోళనలతో ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్ అలెర్ట్‌ అయ్యి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇటు బెటాలియన్ పోలీసుల ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్దకు వస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని.. 10 మందిని ఉద్యోగం నుండి తీసేశారని.. బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డే వంద సార్లు అన్నాడు.. ఏక్ పోలీస్ చేస్తానని.. ఇప్పుడు కనీసం కలవడం లేదని వాపోయారు.