TG MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారా.. అయితే ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
TG MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే.. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ భిన్నంగా ఉంటాయి. ఏ చిన్న పొరపాటు చేసినా ఓటు చెల్లకుండా పోతుంది.

తెలంగాణలో గతంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో చదువుకున్న వారు కూడా ఓటింగ్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నెల 27న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటికి రెండు సార్లు ఓటు వేసే విషయంలో అవగాహనను పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాణాల ప్రకారం నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్య క్రమంలో ఓటేయాలని స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయాలు మర్చిపోవద్దు..
బ్యాలెట్ పత్రంలో పోలింగ్ సిబ్బంది ఇచ్చే వాయిలెట్ రంగు స్కెచ్ పెన్నుతోనే ఓటు వెయ్యాలి. వేరే పెన్ను, పెన్సిల్‌ను ఉపయోగించొద్దు. టిక్ పెట్టడం, ఓకే అనే అక్షరాలు కూడా రాయకూడదు.
మొదటి ప్రాధాన్యత ఇవ్వదలచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బ్రాకెట్‌లో 1 నంబర్ వేయాలి. అంకె వేయకుండా 2, 3, ఇతర సంఖ్యలను వేయకూడదు. కచ్చితంగా 1 అంకె ఎవరికైనా ఇవ్వాలి.
అభ్యర్థుల్లో కచ్చితంగా 1 అంకె ఎవరికైనా వేయాలి. మిగతా అభ్యర్థులకు వేయడమనేది ఓటరు ఇష్టం. 1 అంకె తరువాత మిగతా 2, 3, 4 ఇలా నచ్చిన అభ్యర్థికి అంకెలను వారి పేరు పక్కన సూచించిన బ్రాకెట్‌లో వేయాలి.
ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్య సంఖ్యను మాత్రమే ఇవ్వాలి. ఒకే అంకెను ఇద్దరి ముగ్గురికి ఇవ్వొద్దు. 1, 2, 3, 4 లేదా రోమన్ అంకెలు వరుసగా నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యంగా వేయాలి.
ఇంగ్లీష్‌లో వన్ అని.. ఓకె అని ఇతర గుర్తులు, పదాలు అస్సలు రాయకూడదు. కేవలం అంకెలను మాత్రమే రాయాలి. బ్యాలెట్‌లో పేరు, సంతకం ఇతర అక్షరాలు ఏవి రాసినా అవి చెల్లవు. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.
అభ్యర్థి, పేరు, ఫొటో పక్కన ఉన్న బ్రాకెట్‌లో మధ్యలోనే అంకెను వేయాలి. అభ్యర్థి పేరున్న గడి గీత దాటి వేయొద్దు. పేరుపైన టిక్ చేయొద్దు. వరుస సంఖ్యపైన మార్క్ చేయొద్దు. అలా చేస్తే ఆ ఓటు చెల్లదు.
లెక్కింపు విధానం..
మొదట, పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసివేస్తారు. చెల్లిన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోతే.. తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని తొలగిస్తారు. తొలగించిన అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియను ఏ అభ్యర్థికి అయినా 50 శాతం ఓట్లు వచ్చే వరకు కొనసాగిస్తారు.